ఇది చాలా అన్యాయం: సెహ్వాగ్‌

క్రికెట్‌ అభిమానులు ఎన్నటికీ మరవలేనిదిగా పంజాబ్‌×ముంబయి మ్యాచ్‌ చరిత్రలో నిలిచిపోతోంది. మ్యాచ్‌తో పాటు సూపర్‌ ఓవర్‌ టై కావడం.. తర్వాత మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించడం.. 

Published : 19 Oct 2020 17:35 IST

ఇంటర్నెట్‌డెస్క్: క్రికెట్‌ అభిమానులు ఎన్నటికీ మరవలేనిదిగా పంజాబ్‌×ముంబయి మ్యాచ్‌ చరిత్రలో నిలిచిపోతోంది. మ్యాచ్‌తో పాటు సూపర్‌ ఓవర్‌ టై కావడం.. తర్వాత మరో సూపర్‌ ఓవర్‌ నిర్వహించడం.. చివరికి ముంబయిపై పంజాబ్‌ విజేతగా నిలవడం తెలిసిందే. అయితే నరాలు తెగే ఉత్కంఠతో మునివేళ్ల మీద నిలబెట్టిన ఈ మ్యాచ్‌కు అభిమానులే కాదు, క్రీడా, సినీ ప్రముఖులు సైతం ఆస్వాదిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

అభిమానులను ఉర్రూతలూగించిన ఈ మ్యాచ్‌పై టీమిండియా మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్‌ సింగ్‌ కూడా ట్వీట్‌ చేశారు. ‘‘ఒకే మ్యాచ్‌లో రెండు సూపర్‌ ఓవర్‌లా. ఇది చాలా అన్యాయం. అయితే 2020లో ఉత్తమమైనది ఈ టీ20 లీగే అని చెప్పడానికి ఇదే ఉదాహరణ’’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. మరోవైపు యువీ.. ‘‘2019 ప్రపంచకప్‌ పైనల్‌? ముంబయి×పంజాబ్‌ మ్యాచ్‌?.. దీనిలో ఏది అత్యుత్తమ గేమ్‌? అద్భుత సంఘటనలు జరిగాయి. రెండు జట్లు గొప్ప పోరాట పటిమ చూపాయి. ముంబయి తరఫున గేమ్‌ ఛేంజర్‌ బుమ్రా అయితే పంజాబ్‌ వైపు కేఎల్ రాహుల్‌. ఇక యూనివర్సల్ బాస్‌ గేల్‌, మయాంక్‌ మ్యాచ్‌కు గొప్ప ముగింపునిచ్చారు’’ అని ట్వీటాడు.

పంజాబ్‌ యజమాని, బాలీవుడ్‌ నటి ప్రీతి జింటా మ్యాచ్ ప్రభావంతో ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నానని ట్వీట్‌ చేశారు. ‘‘చర్యలు.. మాటల కంటే బిగ్గరగా భావాన్ని తెలియజేస్తాయి. నా భావాన్ని మాటల్లో వర్ణించడంలో విఫలమయ్యా. రెండు సూపర్‌ ఓవర్‌లా!! ఇది ఊహించనిది. ఇప్పటికీ షాక్‌లోనే ఉన్నా. మా జట్టు సభ్యులను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. అద్భుతమైన మ్యాచ్‌ ఇది. ఆహా.. ఆ ఫీలింగ్‌ ఎంతో బాగుంది. గొప్ప ప్రదర్శన చేసిన మా సుప్రీం టీమ్‌కు ధన్యవాదాలు. జట్టుగా పోరాడితే అత్యుత్తమ ఫలితమే వస్తుంది’’ అని ప్రీతి జింటా పేర్కొన్నారు. ఇటీవల బెంగళూరు మ్యాచ్‌లోనూ ఆఖరి బంతికి పంజాబ్‌ విజయం సాధించిన సందర్భంలో ఆమె ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లను చివరి వరకు తెచ్చి ప్రేక్షకులకు హార్ట్‌ ఎటాక్‌ తెప్పించవద్దని జట్టును వేడుకుంటూ సరదాగా ట్వీట్‌ చేశారు. కానీ పంజాబ్‌ మరోసారి తీవ్ర ఉత్కంఠ పోరులోనే విజయం సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని