Wrestlers Protest: ప్రియాంక ఓదార్పు.. ఫొగాట్‌ సిస్టర్స్‌ మధ్య ట్విటర్ వార్‌..!

భాజపా నేత బబితా ఫొగాట్(Babita Phogat), నిరసన దీక్షలో ఉన్న రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్(Vinesh Phogat) మధ్య ట్విటర్ వార్ జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

Updated : 30 Apr 2023 08:38 IST

దిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత రెజ్లింగ్‌ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన చేపడుతోన్న రెజ్లర్లకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi ) మద్దతు పలికారు. ఆమె రాక ఫొగాట్‌ సిస్టర్స్‌ మధ్య ట్విటర్ వార్‌కు దారితీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? (Wrestlers protest)

దిల్లీలోని రెజ్లర్ల నిరసన వేదిక జంతర్ మంతర్‌ను శనివారం ప్రియాంక(Priyanka Gandhi ) సందర్శించారు. ఆవేదనలో ఉన్న రెజ్లర్ల(Wrestlers)ను ఓదార్చారు. అప్పుడు ప్రియాంక వెంట వ్యక్తిగత సహాయకుడు సందీప్‌ సింగ్‌ కూడా ఉన్నారు. దీనిపై భాజపా నేత బబితా ఫొగాట్‌(Babita Phogat) ట్వీట్ చేశారు. ‘మహిళా రెజ్లర్లకు మద్దతివ్వాలని ప్రియాంకా గాంధీ తన వ్యక్తిగత సహాయకుడితో కలిసి జంతర్‌మంతర్‌కు వెళ్లారు. కానీ ఆ సహాయకుడే మహిళలను వేధించిన, ఓ వర్గం వారిని కించపరిచిన కేసులో నిందితుడు’ అంటూ దానిలో పేర్కొన్నారు. తనను అవమానించాడని, కులం పేరుతో దూషించాడని బిగ్‌బాస్‌ 16 కంటెస్టెంట్ అర్చనా గౌతమ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సందీప్‌పై యూపీ పోలీసులు ఇదివరకు కేసు నమోదుచేశారు. ఆమె ప్రియాంకను కలిసేందుకు ప్రయత్నించిన సమయంలో అతడు ఆ విధంగా ప్రవర్తించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

కాగా బబిత చేసిన ట్వీట్‌కు ఆమె సోదరి, నిరసనకు నాయకత్వం వహిస్తోన్న వినేశ్‌ ఫొగాట్(Vinesh Phogat) గట్టిగా బదులిచ్చారు. ‘అన్యాయానికి బలైన రెజ్లర్లకు మీరు అండగా నిలబడలేకపోతే కనీసం.. మా పోరాటాన్నైనా బలహీనపర్చవద్దు. తమను వేధిస్తున్న వారి గురించి బయటపెట్టేందుకు మహిళా రెజ్లర్లకు ఇన్నేళ్లు పట్టింది. మీరు కూడా ఒక మహిళే. మా బాధను అర్థం చేసుకోండి’ అని తీవ్ర ఆవేదనతో అభ్యర్థన చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని