IND vs AUS: టెస్టుల్లోకి అరంగేట్రం.. ఒకరు నాలుగేళ్లుగా జట్టుతోనే.. మరొకరు టీ20ల్లో నంబర్‌వన్‌

బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy).. భారత్‌ - ఆసీస్ (IND vs AUS) జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌. తాజాగా తొలి మ్యాచ్‌లో ఇద్దరు భారత ఆటగాళ్లు టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

Published : 09 Feb 2023 16:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) తరఫున ఇద్దరు ఆటగాళ్లు టెస్టుల్లోకి అరంగేట్రం చేశారు. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ (Border - Gavaskar Trophy)లో భాగంగా భారత్ - ఆసీస్‌ తొలి టెస్టు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇద్దరిలో ఇప్పటికే వన్డేలు, టీ20ల్లో టాప్‌ బ్యాటర్‌గా ఎదిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ (Surya Kumar Yadav) ఉన్నాడు. గతేడాది నుంచి సూర్యకుమార్‌ పొట్టి ఫార్మాట్‌లో దుమ్మురేపుతున్నాడు. దీంతో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. ఇప్పటి వరకు 20 వన్డేలు, 48 టీ20లను ఆడాడు. గతంలోనూ టెస్టు స్క్వాడ్‌లోకి ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. ఈ సారి మిడిల్‌ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే రిషభ్‌ పంత్ రోడ్డు ప్రమాదం కారణంగా దూరం కావడంతో సూర్యకు అవకాశం దక్కింది. క్లిష్టపరిస్థితుల్లో దూకుడుగా ఆడి జట్టుకు అండగా నిలుస్తాడని మేనేజ్‌మెంట్ నమ్మకం పెట్టుకొంది. మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా సూర్యకుమార్ (జెర్సీ - 63) తన టెస్టు క్యాప్‌ను అందుకొన్నాడు. 

తెలుగు కుర్రాడు.. 

ఇండియా - ఏ తరఫున ఆడిన ఆంధ్రప్రదేశ్‌ ఆటగాడు కోన శ్రీకర్ భరత్‌ (KS Bharat) ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అదరగొట్టాడు. కేవలం 79 మ్యాచుల్లోనే 4,289 పరుగులు సాధించాడు. 2019లోనే బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో అవకాశం రాలేదు. అలాగే రెండేళ్ల కిందట (2021) ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ కోసం ఎంపిక చేసిన స్టాండ్‌బై ఆటగాళ్లలో కేఎస్‌ భరత్‌ కూడా ఉన్నాడు. గత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో కివీస్‌తో తలపడినప్పుడు భరత్‌ సబ్‌స్టిట్యూట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. సాహా గాయపడటంతో అతడి స్థానంలో వచ్చిన శ్రీకర్‌ రెండు క్యాచ్‌లు, ఒక స్టంపౌట్‌ చేశాడు. ఇప్పుడు పూర్తిస్థాయిలో టెస్టు క్రికెట్‌ అరంగేట్రం చేయడం విశేషం. ఛెతేశ్వర్ పుజారా చేతులమీదుగా తన టెస్టు క్యాప్‌ను భరత్ (జెర్సీ - 14) అందుకొన్నాడు. బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌లకు స్క్వాడ్‌లో ఉన్నా తుది జట్టులో మాత్రం స్థానం దక్కించుకోలేదు. ఎట్టకేలకు ఆసీస్‌తో ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్ - గావస్కర్‌ ట్రోఫీలో చోటు సంపాదించాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని