Team India: సూపర్-8 పోరుకు ముందే.. ఆ ఇద్దరు స్వదేశానికి!

పొట్టి కప్‌లో టీమ్‌ఇండియా అదరగొడుతోంది. హ్యాట్రిక్‌ విజయాలతో సూపర్-8కి చేరింది. ఫ్లోరిడా వేదికగా లీగ్‌ స్టేజ్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడనుంది.

Updated : 14 Jun 2024 12:57 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) గ్రూప్‌ స్టేజ్‌లో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే.. భారత్ ‘సూపర్-8’కి చేరుకుంది. చివరి మ్యాచ్‌ను ఫ్లోరిడా వేదికగా జూన్ 15న టీమ్‌ఇండియా కెనడాతో తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత భారత్‌ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్, అవేశ్‌ ఖాన్ స్వదేశానికి పయనమవుతారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వారిద్దరు ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. మరో ఇద్దరు రింకు సింగ్, ఖలీల్ అహ్మద్‌ మాత్రం జట్టుతోపాటు ఉంటారని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. 15 మందితో కూడిన స్క్వాడ్‌లో ఎవరైనా గాయపడితే.. ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ప్లేయర్లతో వారి స్థానాన్ని భర్తీ చేస్తారు. ఇప్పటి వరకు అలాంటి అవసరం భారత్‌కు రాలేదు.  

చాహల్‌ను తీసుకోవాలి: శ్రీశాంత్

యూఎస్‌ఏ పిచ్‌లపై స్పిన్నర్ల కంటే సీమర్ల ప్రభావం ఎక్కువ. దీంతో భారత్ స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ను అవకాశం కల్పించింది. ఇప్పుడు సూపర్-8 మ్యాచులను టీమ్‌ఇండియా ‘విండీస్’ వేదికగా ఆడనుంది. అక్కడ స్పెషలిస్ట్‌ స్పిన్నర్ల అవసరం ఉంటుంది. దీంతో జట్టులోకి చాహల్‌ను తీసుకోవాలని మాజీ పేసర్ శ్రీశాంత్ సూచించాడు. 

‘‘వెస్టిండీస్‌ పిచ్‌లకు సంబంధించి జట్టులో ఎలాంటి మార్పులు చేయాలనేది రాహుల్‌ ద్రవిడ్‌కు బాగా తెలుసు. అయితే, నా సూచన మాత్రం యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకుంటే బాగుంటుంది. నలుగురు స్పిన్నర్లతో భారత్‌ స్క్వాడ్‌ను ప్రకటించింది. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లోనూ తాము ఎందుకు వారిని తీసుకున్నామనేది రోహిత్ కూడా చెప్పాడు. అయితే, అక్షర్ పటేల్ ఇటు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తుండటంతో తుది నిర్ణయం తీసుకోవడం భారత మేనేజ్‌మెంట్‌కు ఇబ్బందే. ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరంగా మారింది’’ అని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని