ICC: ‘వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2022’.. టీమ్‌ఇండియా నుంచి ఎవరెవరంటే?

వన్డే ఫార్మాట్‌లో గతేడాది అత్యద్భుతంగా రాణించిన ఆటగాళ్లతో కూడిన వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2022 (ODI Team of The Year 2022)కి సంబంధించిన పురుషుల, మహిళా జట్లను ఐసీసీ (ICC) విడుదల చేసింది. ఇందులో ఐదుగురికి అవకాశం దక్కగా.. ఇందులో ముగ్గురు మహిళా క్రికెటర్లు ఉన్నారు.

Published : 24 Jan 2023 18:32 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  పురుషుల, మహిళల ‘వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్ 2022’ జట్లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించింది. పురుషుల విభాగంలో.. టీమ్‌ఇండియా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు అవకాశం దక్కింది. అయితే అందులో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లీ, డబుల్‌ సెంచరీ సాధించిన ఇషాన్‌ కిషన్‌, గిల్‌కు స్థానం దక్కలేదు. ఐసీసీ ప్రకటించిన జట్టుకు పాక్‌ సారథి  బాబర్ అజామ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. భారత్‌ నుంచి మిడిలార్డర్‌ బ్యాటర్‌తోపాటు బౌలర్‌ను మాత్రమే సెలెక్ట్‌ చేయడం విశేషం. గతేడాది వరుసగా అర్ధశతకాలు సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌తోపాటు వన్డేల్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన సిరాజ్‌కు మాత్రమే అవకాశం దక్కింది. అయ్యర్ 17 మ్యాచుల్లో 724 పరుగులు సాధించగా.. సిరాజ్‌ 15 వన్డేల్లో 24 వికెట్లు తీశాడు.

జింబాబ్వేకు సంచలన విజయాలను అందించిన ఆ జట్టు బ్యాటర్ సికిందర్‌ రజాను ఎంపిక చేసిన ఐసీసీ.. బంగ్లా ఆల్‌రౌండర్‌ మెహిదీ హసన్‌ను కూడా తీసుకొంది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్ ట్రావిస్‌ హెడ్, వెస్టిండీస్‌ నుంచి షై హోప్‌, న్యూజిలాండ్‌ తాత్కాలిక కెప్టెన్ టామ్‌ లేథమ్‌ను సెలెక్ట్‌ చేసింది. మొత్తం 11 మంది సభ్యుల్లో ఇద్దరు ఆల్‌రౌండర్లు కాగా.. ఐదుగురు స్పెషలిస్ట్‌ బ్యాటర్లు.. మరో నలుగురు బౌలర్లు ఉన్నారు. కేవలం ఒకే ఒక్క స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాను మాత్రమే తుది జట్టులోకి తీసుకోవడం గమనార్హం. శ్రీలంక, దక్షిణాఫ్రికా,అఫ్గానిస్థాన్‌ నుంచి ఒక్కరికీ అవకాశం దక్కలేదు. 

ఐసీసీ వన్డే టీమ్‌ ఆఫ్‌ ఇయర్‌ 2022: బాబర్ అజామ్‌, ట్రావిస్‌ హెడ్‌, షై హోప్, శ్రేయస్‌ అయ్యర్, టామ్‌ లేథమ్, సికిందర్  రజా, మెహిదీ హసన్ మిరాజ్, అల్జారీ జోసెఫ్‌, మహమ్మద్‌ సిరాజ్, ట్రెంట్‌ బౌల్ట్, ఆడమ్‌ జంపా

మహిళా జట్టులో ముగ్గురు..

ఐసీసీ ప్రకటించిన మహిళల ‘వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్’ జట్టులోనూ ముగ్గురు భారత ప్లేయర్లు స్థానం సంపాదించారు. ఇద్దరు బ్యాటర్లు కాగా.. మరొకరు బౌలింగ్‌ జాబితాలో దక్కించుకొన్నారు. టీమ్‌ఇండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ ప్రీత్‌ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన, టాప్‌ బౌలర్ రేణుకా సింగ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. స్మృతీ మంధాన గత క్యాలెండర్‌ సంవత్సరంలో ఒక సెంచరీ, ఆరు అర్ధశతకాలను నమోదు చేయగా.. కెప్టెన్ హర్మన్‌ రెండు సెంచరీలు, ఐదు అర్ధశతకాలను చేసింది. ఇక రేణుకా సింగ్‌ కేవలం ఏడు మ్యాచుల్లోనే 18 వికెట్లు తీసింది. 

ఇదీ జట్టు: అలీసా హీలీ, బెత్‌ మూనీ, స్మృతీ మంధాన, హర్మన్‌ ప్రీత్‌ కౌర్, రేణుకా సింగ్‌, లారా వోల్వార్డ్ట్,ఆయబొంగ ఖాకా, షబ్నిమ్‌ ఇస్మాయిల్‌, నాట్‌ స్కివెర్, సోఫీ ఎక్లెస్టోన్, అమేలియా కెర్


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు