MS Dhoni : ధోనీ వీడ్కోలు పలికి అప్పుడే రెండేళ్లు.. మరోసారి వైరల్‌గా మారిన రిటైర్మెంట్‌ ‘టైమ్‌’

సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజున (ఆగస్ట్‌ 15) భారత క్రికెట్‌ అభిమానులకు మింగుడు పడని విషయం చోటు చేసుకుంది. టీమ్‌ఇండియాకు నాయకుడిగా వన్డే, టీ20 ప్రపంచకప్‌లను...

Updated : 15 Aug 2022 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజున (ఆగస్ట్‌ 15) భారత క్రికెట్‌ అభిమానులకు మింగుడు పడని విషయం చోటు చేసుకుంది. టీమ్‌ఇండియాకు నాయకుడిగా వన్డే, టీ20 ప్రపంచకప్‌లను అందించిన కెప్టెన్‌ కూల్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. భారతావని 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ మరోసారి ధోనీ కెప్టెన్సీని అభిమానులు తలచుకుంటున్నారు. దీంతో రెండేళ్ల కిందట ధోనీ తన సోషల్‌ మీడియా ఖాతాలో పెట్టిన పోస్టు తాజాగా వైరల్‌గా మారింది. ‘‘కెరీర్‌ ఆసాంతం మద్దతు నిలిచి ప్రేమాభిమానులు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. 1929 గంటల నుంచి నన్ను రిటైర్డ్‌గా పరిగణించాలి’’ అని పోస్టు పెట్టాడు. అప్పుడు 1929 గంటలు.. అనే పదం వైరల్‌గా మారగా.. తాజాగా మరోసారి నెట్టింట్లో వైరల్‌ అయింది. ఇంతకీ దీనిని ఎంఎస్ ధోనీ ఎందుకు వాడాడో తెలుసా...? 

దాదాపు 28 ఏళ్ల తర్వాత 2011లో భారత్‌ రెండో వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది. అంతకుముందు 2007లో మొదటి టీ20 ప్రపంచకప్‌ను కూడా టీమ్ఇండియానే సొంతం చేసుకుంది. అయితే ఈ రెండింటినీ తన నాయకత్వ పటిమతో సాధించి పెట్టాడు రాంచీ డైనమైట్ ఎంఎస్ ధోనీ. అదేవిధంగా భారత జట్టును ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోనూ నిలబెట్టాడు. 2014లో టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ 2017 నాటికి వన్డే, టీ20 సారథ్య బాధ్యతలను వదిలేశాడు. తర్వాత విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత్‌ 2019 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరుకుంది. అయితే న్యూజిలాండ్‌పై కాస్త తేడాతో టీమ్‌ఇండియా ఓటమిపాలైంది. జడేజా, ఎంఎస్ ధోనీ ఆఖరివరకు శ్రమించినా విజయం చేకూర్చలేకపోయారు. అయితే ఆ మ్యాచ్‌ తర్వాతి నుంచే ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాడని వార్తలు హల్‌చల్‌ చేశాయి. చివరికి ఆ రోజు రానేవచ్చింది. రెండేళ్ల కిందట 2020 ఆగస్ట్‌ 15న రాత్రి 7.29 గంటలకు (1929 గంటలు) రిటైర్మెంట్‌ తీసుకున్నట్లు ప్రకటించాడు. అదీనూ ఆర్మీ టైమ్‌ పద్ధతిలో వెల్లడించాడని అభిమానులు అంటున్నారు. ఎందుకంటే క్రికెట్‌కు సేవలందించినగాను 2011లోనే భారత ఆర్మీ ధోనీకి లెఫ్టనెంట్ కల్నల్‌ ర్యాంక్‌ను అందించి గౌరవించింది. 2019 ఆగస్ట్‌లో రెండు వారాలపాటు జమ్మూకశ్మీర్‌ ప్రాంతంలో ఆర్మీ తరఫున విధులు కూడా నిర్వర్తించాడు. అందుకే తాను క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సమయం (రాత్రి 7.29 గంటలు) తెలపడానికి ఆర్మీ టైమ్‌ పద్ధతినే (1929 గంటలు) పాటిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసినట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని