Updated : 30 Jan 2022 05:10 IST

U-19 World Cup 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన యువ భారత్‌

అంటిగ్వా: అండర్‌-19 ప్రపంచకప్‌లో డిపెండింగ్‌ ఛాంపియన్‌ బంగ్లాదేశ్‌కు యువభారత్‌ షాక్‌ ఇచ్చింది. కీలక క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో భారత జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. మొదట టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ ప్రత్యర్థి జట్టును 111 పరుగులకే కుప్పకూల్చింది.  అనంతరం 30. 5 ఓవర్లలో భారత జట్టు 112 లక్ష్యాన్ని ఛేదించింది. భారత జట్టులో రఘువంశీ(44), షేక్‌ రషీద్‌ (26), కెప్టెన్‌ యశ్‌ దుల్‌(20 నాటౌట్‌) రాణించారు. భారత బౌలర్లలో రవికుమార్‌ మూడు, విక్కీ ఓస్వాల్‌ రెండు, కౌశల్‌ తంబే, రఘువన్షీ, రాజవర్దన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. మూడు వికెట్లు తీసి విజయం కీలక పాత్ర పోషించిన రవికుమార్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇక భారత్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

స్వల్ప లక్ష్యమైనప్పటికీ..

 ప్రత్యర్థి జట్టును 111 పరుగులకే కట్టడి చేసిన సంతోషంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.  మూడు బంతులు ఎదుర్కొన్న హర్నూర్‌ సింగ్‌ హసన్‌ సకిబ్‌ బౌలింగ్‌లో డౌకటయ్యాడు. దీంతో వన్‌డౌన్‌లో వచ్చిన ఆంధ్ర కుర్రాడు షేక్‌ రషీద్‌(26)తో కలిసి మరో ఓపెనర్‌ రఘువంశీ(44) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.  వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్‌ను జాగ్రత్తగా నిర్మించారు. దీంతో రెండో వికెట్‌కు భారత్‌ 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి పటిష్ట స్థితికి చేరుకుంది. ఇక విజయం లాంఛనమే అన్న సమయంలో  స్వల్వ వ్యవధిలోనే వీరు ఔటయ్యారు. అయితే క్రీజులో కెప్టెన్‌ యశ్‌ధూల్‌(20 నాటౌట్‌) ఉండడంతో భారత్‌ ఎలాంటి ఒత్తిడి లేకుండానే ముందుకు సాగింది. ఈ క్రమంలో 82 పరుగుల వద్ద సిద్ధార్థ్‌ యాదవ్‌, 97 పరుగుల వద్ద రాజ్‌ బవా ఔటయ్యారు. అప్పటికీ భారత్‌ స్కోర్‌ 25.1 ఓవర్లలో 97 పరుగులు.  ఆ సమయంలో భారత్‌ విజయానికి 15 పరుగులు అవసరం. అయితే భారత్‌ విజయం కోసం మరో ఐదు ఓవర్లు  ఆడాల్సి వచ్చింది. చివర్లో కౌశల్‌ తంబే సిక్స్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.  ఇటీవల జరిగిన ఆసియాకప్‌ సెమీస్‌లోనూ బంగ్లాదేశ్‌ను యువ భారత్‌ చిత్తు చేసిన విషయం తెలిసిందే. 

బంగ్లాదేశ్‌ బ్యాటర్లను బెంబేలెత్తించిన బౌలర్లు
తొలుత టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌ ఆరంభం నుంచి ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీసింది. భారత బౌలర్‌ రవికుమార్ ఆ జట్టుకు వరుసగా షాక్‌లు ఇచ్చాడు. రవికుమార్‌ దెబ్బకు బంగ్లా ఓపెనర్లు మెహ్‌ఫిజుల్ ఇస్లామ్‌ (2), ఇఫ్తకర్‌ హోసైన్‌ ఇఫ్తీ (1) సహా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ప్రాంతిక్‌ నవ్రోజ్‌ నబిల్‌ (7)లు 14 పరుగులలోపే ఔటయ్యారు. అనంతరం 37 పరుగుల వద్ద బంగ్లా వరుసగా రెండు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లోకి జారుకుంది. దీంతో ఒత్తిడికి గురైన బంగ్లా జట్టు భారత బౌలర్ల ధాటికి  క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. దీంతో ఒకానొక దశలో కనీసం 100 పరుగులైనా దాటుతుందా అనిపించింది. అయితే ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన ఎస్‌ఎమ్ మెహ్రోబ్‌ (30), అషికర్‌ జమాన్‌ (16) ధాటిగా ఆడి పరుగులు రాబట్టారు. దీంతో బంగ్లాదేశ్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.  

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని