Pogba: రొనాల్డో దారిలో మరో స్టార్‌ ఫుట్‌బాలర్‌

మరో ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో దారిలో నడిచాడు. ప్రెస్‌మీట్‌ సందర్భంగా ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ పాల్‌ పోగ్బా తన ముందున్న ఓ బీర్‌ బాటిల్‌ను ఏకంగా కింద పెట్టేశాడు....

Updated : 17 Jun 2021 00:26 IST

బీర్‌ బాటిల్‌ను కిందపెట్టేసిన పాల్‌ పోగ్బా

మునిచ్‌: మరో ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో దారిలో నడిచాడు. ప్రెస్‌మీట్‌ సందర్భంగా ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ పాల్‌ పోగ్బా తన ముందున్న ఓ బీర్‌ బాటిల్‌ను ఏకంగా కింద పెట్టేశాడు. యూఈఎఫ్‌ఏ యూరో 2020 టోర్నమెంట్‌లో భాగంగా జర్మనీపై గెలుపొందిన అనంతరం జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా.. బుధవారం ఫ్రాన్స్‌, జర్మనీ మధ్య ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సాగింది. ఈ ఉత్కంఠ పోరులో జర్మనీపై ఫ్రాన్స్‌ 1-0 తేడాతో విజయం సాధించింది.

మ్యాచ్‌ అనంతరం ఫ్రాన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ పాల్‌ పోగ్బా ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. అయితే టేబుల్‌పై ఆయన ముందున్న బీర్‌ బాటిల్‌ను తీసి కిందపెట్టేశారు. టోర్నీ స్పాన్సర్లలో ఆ కంపెనీ కూడా ఒకటి. మద్యపానానికి దూరంగా ఉండే పోగ్బా ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ టోర్నీలో ఇలా వ్యవహరించిన రెండో క్రీడాకారుడు పోగ్బా. అంతకముందు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన ముందున్న రెండు కోకాకోలా బాటిళ్లను తీసి దూరంగా పెట్టిన విషయం తెలిసిందే. 

సోమవారం ఓ జట్టుతో మ్యాచ్‌కు ముందు పోర్చ్‌గీసు జట్టు సారథి క్రిస్టియానో రొనాల్డో, జట్టు మేనేజర్‌ ఫెర్నాండో సాంటోస్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ప్రెస్‌మీట్‌ ఏర్పాట్లలో భాగంగా  టోర్నీ స్పాన్సర్‌ అయిన కోకకోలాకు చెందిన రెండు కూల్‌డ్రింక్‌ బాటిళ్లను వారి ఎదురుగా ఉంచారు. ఫిట్‌నెస్‌ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండే రొనాల్డో ఏమనుకున్నాడో ఏమో కానీ.. ఆ రెండు సీసాలను అక్కడి నుంచి తీసేసి దూరంగా పెట్టాడు. పక్కనే ఉన్న వాటర్‌బాటిల్‌ను అందుకొని ‘మంచి నీళ్లు తాగండి’ అని వ్యాఖ్యానించాడు.

రొనాల్డో చాలా సాధారణంగానే ఈ వ్యాఖ్య చేసినా.. కోకకోలా షేర్లపై అది ప్రతికూల ప్రభావం చూపింది. స్టాక్‌మార్కెట్లో ఆ షేరు విలువ 1.6 శాతం పడిపోయింది. దీంతో కోకకోలా మార్కెట్‌ విలువ 242 బిలియన్‌ డాలర్ల నుంచి 238 బిలియన్‌ డాలర్లకు కుంగింది. అంటే దాదాపు రూ.29 వేల కోట్ల రూపాయల విలువైన సంపద ఆవిరైపోయిందన్నమాట. ఈ టోర్నీ స్పాన్సర్లలో కోకకోలా కూడా ఒకటి.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని