
Euro cup: ఇంగ్లాండ్ ఫుట్‌బాలర్లపై జాతి వివక్ష, దూషణ
ఖండించిన బ్రిటన్ ప్రధాని, క్రీడాకారులు, ప్రముఖులు
లండన్: ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ క్రీడాకారులపై జాతివివక్ష వ్యాఖ్యలను ప్రధాని బోరిస్ జాన్సన్ ఖండించారు. ఓడిపోయిన వారిని అలా నిందించడం దుర్మార్గ చర్యగా వర్ణించారు. ఇలాంటి ప్రవర్తనకు తమకు తామే సిగ్గుపడాలని విమర్శించారు.
ఇటలీతో జరిగిన యూరోకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ త్రుటిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. స్కోర్లు 1-1తో సమం కావడంతో విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. అందులో ఇటలీ 3-2 తేడాతో విజయం సాధించింది. అయితే ఇంగ్లాండ్ జట్టులోని ముగ్గురు నల్లజాతీయులు పెనాల్టీ కిక్స్‌ను గోల్స్‌గా మలచలేకపోయారు. వారే మార్కస్ రష్‌ఫోర్డ్, బుకాయో సకా, జడాన్ సాంచో. మ్యాచు ఓడిపోగానే సోషల్‌మీడియాలో, బయట వీరిపై జాతి వివక్ష వ్యాఖ్యలు మొదలయ్యాయి.
‘జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినవారు తమకు తామే సిగ్గుపడాలి’ అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు. ఆటగాళ్లపై దూషణ సహించరానిది, ఇది కచ్చితంగా దుష్ప్రవర్తనే అని ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ సంఘం ప్రకటించింది. దూషణ ఆమోదయోగ్యం కాదంటూ లండన్ పోలీసులు అన్నారు. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన వారిపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
పీటర్సన్ ఘాటు విమర్శలు
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ సారథి కెవిన్ పీటర్సన్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన వారిని తీవ్రంగా విమర్శించారు. ‘రాత్రి ఇంటికి వెళ్లేందుకు కారు తీసినప్పుడు చాలా భయమేసింది. అదో భయానక దృశ్యం! 2021లో ఇలాంటి ప్రవర్తనా? ఆటగాళ్లను దూషిస్తే మనకు ఆనందం కలుగుతుందా? 2030 ప్రపంచకప్‌నకు మనం అర్హులమేనా?’ అని పీటర్సన్ ప్రశ్నించాడు.
‘బ్రిటన్‌లోని మీడియా బహుశా ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైంది. దూషణలకు దిగిన వారి ఖాతాలను తనిఖీ చేసేలా సోషల్ మీడియాపై ఒత్తిడి చేసే బాధ్యత వారిదే. ఇవేవీ రోబోట్స్ చేసినవి కావు! నకిలీ ఖాతాలూ కావు! బాధ్యత అందరికీ ఉంది. ఈ ప్రవర్తన సమాజాన్ని దిగజారుస్తోంది’ అని మరో ట్వీట్లో అన్నాడు.