Under 19 World Cup: ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లిన యువభారత్‌

అండర్-19 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది

Updated : 03 Feb 2022 06:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను 96 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఫైనల్‌ పోరులో ఇంగ్లాండ్‌తో తలపడడమే తరువాయి. అంటిగ్వా వేదికగా జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టింది. 37 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తడబాటుకు గురైంది. 40 ఓవర్లకు భారత్‌ స్కోర్‌ 2 వికెట్ల నష్టానికి 182 పరుగులు. అయితే చివరి పది ఓవర్లలో భారత ఆటగాళ్లు 108 పరుగులు చేసి ఊహించని లక్ష్యాన్ని ప్రత్యర్థి ఎదుట ఉంచారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్లు రఘువంశీ 6, హర్నూర్ సింగ్‌ 16 తక్కువ పరుగులకే పెవిలియన్‌ బాట పట్టినప్పటికీ కెప్టెన్‌ యశ్‌ ధూల్‌ (110: 10 ఫోర్లు, ఒక సిక్స్), వైస్‌ కెప్టెన్‌, ఆంధ్రా కుర్రాడు షేక్‌ రషీద్‌(94: 8 ఫోర్లు, ఒక సిక్స్) నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించి తర్వాత చెలరేగి ఆడారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ 204 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

అనంతరం 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. మూడు పరుగులకే తొలి వికెట్‌ సమర్పించుకున్న ఆజట్టు ఆ తర్వాత నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను నిర్మించింది. ఈ క్రమంలో ప్రమాదకరంగా మారుతున్న కోరె మిల్లర్‌(38), క్యాంప్‌బెల్‌(30)జోడిని రఘువంశీ విడగొట్టాడు. దీంతో 71 పరుగుల వద్ద ఆసీస్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అనంతరం స్వల్ప వ్యవధిలోనే 73 పరుగుల వద్ద  మూడో వికెట్‌గా క్యాంప్‌బెల్‌ ఔటయ్యాడు. ఇక అక్కడి నుంచి ఆస్ట్రేలియా పతనం ప్రారంభమైంది. క్రమం తప్పకుండా భారత బౌలర్లు వికెట్లు తీస్తూ కంగారూలపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలో 125 పరుగులకే ఆసీస్‌ 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే మిగతా బ్యాట్స్‌మెన్‌ వికెట్‌ పడకుండా ఆచితూచి ఆడుతూ ఓటమి అంతరాన్ని తగ్గించారు. భారత బౌలర్లలో ఓస్వాల్‌ మూడు, నిషాంత్‌ సింధు, రవికుమార్‌ తలో రెండు వికెట్లు తీశారు. శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ యశ్‌ ధూల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని