Kul-Cha: జడ్డూ స్పిన్నర్‌ అవ్వడం మా దురదృష్టం

రవీంద్ర జడేజా మీడియం పేసర్‌ అయ్యుంటే కుల్‌దీప్‌, తాను కలిసి ఆడేవాళ్లమని యుజ్వేంద్ర చాహల్‌ అంటున్నాడు. హార్దిక్‌ పాండ్య ఉన్నన్ని...

Published : 21 May 2021 16:34 IST

యుజ్వేంద్ర చాహల్‌ ఆవేదన!

ముంబయి: రవీంద్ర జడేజా మీడియం పేసర్‌ అయ్యుంటే కుల్‌దీప్‌, తాను కలిసి ఆడేవాళ్లమని యుజ్వేంద్ర చాహల్‌ అంటున్నాడు. హార్దిక్‌ పాండ్య ఉన్నన్ని రోజులు తమకు జట్టులో చోటు దొరికిందన్నాడు. టీమ్‌ఇండియాకు ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే ఆల్‌రౌండర్‌ అవసరం ఉందన్నాడు. అందుకే జడ్డూ పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగనం చేశాడని.. అతడు స్పిన్నరవ్వడం తమ దురదృష్టమని పేర్కొన్నాడు.

మణికట్టు మాంత్రిక ద్వయం యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ రాకతో ఫింగర్‌ స్పిన్నర్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో తమ చోటు కోల్పోయారు. ఊరించే బంతులేస్తూ వికెట్లే తీయడంతో జట్టు యాజమాన్యం వీరికే ప్రాధాన్యం ఇచ్చింది. హార్దిక్‌ రూపంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌ చేసే మీడియం పేసర్‌ ఆల్‌రౌండర్‌ దొరకడంతో సమతూకం ఉండేది. ఎప్పుడైతే గాయంతో అతడు దూరమయ్యాడో జడ్డూ పునరాగమనం చేశాడు. ప్రస్తుతం యువకులు రావడంతో మణికట్టు జోడీకి చోటు దొరకడం లేదు.  వీరిద్దరూ చివరిసారిగా 2019 వన్డే ప్రపంచకప్‌ లీగు మ్యాచులో కలిసి ఆడటం గమనార్హం.

‘నేనూ, కుల్‌దీప్‌ కలిసి ఆడేటప్పుడు హార్దిక్‌ ఉండేవాడు. మీడియం పేస్‌ బౌలింగ్‌ వేసేవాడు. 2018లో అతడికి గాయం కావడంతో ఆల్‌రౌండర్‌గా జడేజా పునరాగమనం చేశాడు. అతడు ఏడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. దురదృష్టవశాత్తు అతడు స్పిన్నర్‌. అతడు మీడియం పేసర్‌ అయ్యుంటే కుల్‌దీప్‌, నేను కలిసి ఆడేవాళ్లం. ఎందుకంటే మీడియం పేస్‌ ఆల్‌రౌండర్‌ జట్టు అవసరం’ అని చాహల్‌ అన్నాడు.

‘కుల్‌దీప్‌, నేను కలిసి సిరీసులో 50-50 మ్యాచులు ఆడేవాళ్లం. ఐదు మ్యాచుల సిరీసు అయితే  ఒక్కోసారి అతడు, కొన్నిసార్లు నేను 3 మ్యాచులు ఆడేవాళ్లం. 11 మంది జట్టుకు అవసరం. అందులోనూ సమతూకం కావాలి. దాంతో కుల్చాకు అవకాశం దొరకడం లేదు. హార్దిక్‌ ఉంటే మాకు అవకాశాలు ఇచ్చేవాళ్లు. ఏదేమైనా నాకు జట్టులో చోటు దొరకకున్నా టీమ్‌ఇండియా గెలిస్తే సంతోషమే’ అని యూజీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని