RCBW vs UPW: ఓపెనర్లే బాదేశారు.. యూపీ ఘన విజయం

డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్‌ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుపై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 10 Mar 2023 22:45 IST

ముంబయి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో యూపీ వారియర్స్‌ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 139 పరుగుల విజయలక్ష్యాన్ని ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా కేవలం 13 ఓవరల్లో బాదేసింది. అలీసా హీలీ (96 నాటౌట్; 47 బంతుల్లో 18×4,1×6), దేవికా వైద్య (36, 31 బంతుల్లో 5×4) పరుగుల వరద సృష్టించారు.  వీరిద్దరి ధాటికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బౌలర్లు చేతులెత్తేశారు.

139 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన యూపీ.. ఎక్కడా వెనకడుగు వేయలేదు. ప్రారంభం నుంచే అలీసా హేలీ విజృంభించింది. దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీకి పంపించింది. బౌలింగ్‌ ఎవరిదా? అన్నదాంతో సంబంధం లేకుండా వరుస షాట్లు ఆడింది. ఆమెకు మరో ఓపెనర్‌ దేవికా వైద్య చక్కని సహకారం అందించింది. దీనికి తోడు టార్గెట్‌ కూడా చిన్నదే కావడంతో బెంగళూరు జట్టుకు ఓటమి తప్పలేదు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 19.3 ఓవర్లలో 138 పరుగులు చేసి ఆలౌటయ్యింది. ఎల్సే పెర్రీ (52; 6×4, 1×6) అర్ధశతకంతో రాణించగా.. సోఫీ డివైన్‌ (36), శ్రేయాంక పాటిల్‌ (15), ఎరిన్‌ బర్న్స్‌ (12 నాటౌట్‌) పరుగులు చేశారు. యూపీ జట్టులో సోఫీ ఎక్లెస్టోన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ 3, రాజేశ్వరి గైక్వాడ్‌ ఒక వికెట్‌ తీశారు. డబ్ల్యూపీఎల్‌లో భాగంగా యూపీ ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా రెండింట విజయం సాధించింది.  మార్చి 3న గుజరాత్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో గెలుపొంది యూపీ..  దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.  4 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని