Copa America 2024: బ్రెజిల్‌ ఔట్‌.. సెమీఫైనల్లో ఉరుగ్వే

కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీలో బ్రెజిల్‌కు షాక్‌ తగిలింది. క్వార్టర్‌ఫైనల్లో ఉరుగ్వే చేతిలో ఓటమితో ఆ జట్టు టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. నిర్ణీత సమయంలో 0-0తో స్కోరు సమమైన ఈ మ్యాచ్‌లో ఉరుగ్వే పెనాల్టీ షూటౌట్లో 4-2తో గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

Updated : 08 Jul 2024 04:38 IST

విషాదంలో బ్రెజిల్‌ క్రీడాకారులు

లాస్‌ వెగాస్‌: కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీలో బ్రెజిల్‌కు షాక్‌ తగిలింది. క్వార్టర్‌ఫైనల్లో ఉరుగ్వే చేతిలో ఓటమితో ఆ జట్టు టోర్నమెంట్‌ నుంచి నిష్క్రమించింది. నిర్ణీత సమయంలో 0-0తో స్కోరు సమమైన ఈ మ్యాచ్‌లో ఉరుగ్వే పెనాల్టీ షూటౌట్లో 4-2తో గెలిచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్‌లో రెండు జట్లూ తమ ఆటతో ఆకట్టుకోలేకపోయాయి. ఆటలో అంతా తోసుకోవడమే. ఆటగాళ్లు దురుసుగా వ్యవహరించారు. రెండు జట్లూ కలిసి 41 ఫౌల్స్‌ చేశాయి. ఓ రెడ్‌ కార్డు, నాలుగు యెల్లో కార్డులు అందుకున్నాయి. 74వ నిమిషంలో తమ ఆటగాడు నాందెజ్‌ రెడ్‌ కార్డుతో మైదానం నుంచి నిష్క్రమించడంతో ఉరుగ్వే పది మందికే పరిమితమైంది. అయినా బ్రెజిల్‌ గోల్‌ కొట్టలేకపోయింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు గోల్స్‌ కొట్టలేకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ తప్పలేదు. షూటౌట్లో ఉరుగ్వే తరఫున మొదట వాల్వెర్దె స్కోర్‌ చేశాడు. అయితే బ్రెజిల్‌ తొలి పెనాల్టీ (మిలితావ్‌)ని గోల్‌కీపర్‌ సెర్గియో అడ్డుకోవడంతో 1-0తో నిలిచిన ఉరుగ్వే, బెంటార్‌ విజయవంతం కావడంతో 2-0 ఆధిక్యం సంపాదించింది. బ్రెజిల్‌ తరఫున రెండో ప్రయత్నంలో పెరీరా విజయవంతమయ్యాడు. ఆ తర్వాత ఉరుగ్వే తరఫున అరాస్కా స్కోర్‌ చేయగా.. బ్రెజిల్‌ ఆటగాడు లుయిజ్‌ విఫలమయ్యాడు. నాలుగో రౌండ్లో ఉరుగ్వే ఆటగాడు గిమినెజ్‌ గురి తప్పగా.. బ్రెజిల్‌ వైపు నుంచి మార్టినెలి స్కోర్‌ చేశాడు. అప్పటికి 3-2తో నిలిచిన ఉరుగ్వే.. అయిదో రౌండ్లో ఉగార్టె నిర్ణయాత్మక గోల్‌ చేయడంతో విజయాన్నందుకుంది. 2001 నుంచి బ్రెజిల్‌తో పోటీపడ్డ 13 మ్యాచ్‌ల్లో ఉరుగ్వేకు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఆ జట్టు బుధవారం జరిగే సెమీఫైనల్లో కొలంబియాను ఢీకొంటుంది. మరో క్వార్టర్స్‌లో కొలంబియా 5-0తో పనామాను చిత్తు చేసింది. మంగళవారం జరిగే సెమీస్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ అర్జెంటీనా జట్టు కెనడాను ఢీకొంటుంది. కోపా అమెరికాలో ఫైనల్‌ మ్యాచ్‌కు మాత్రమే అదనపు సమయం ఉంది.

మిలితావ్‌ షాట్‌ను అడ్డుకుంటున్న ఉరుగ్వే గోల్‌కీపర్‌

సంబరాల్లో ఉరుగ్వే జట్టు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని