మావాడు ఆడాలి.. టీమ్‌ఇండియా గెలవాలి : నేత్రావల్కర్‌ కుటుంబం ఆసక్తికర వ్యాఖ్యలు

నేడు టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ vs అమెరికా మ్యాచ్‌. ఈ నేపథ్యంలో యూఎస్‌ఏ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్న నేత్రావల్కర్‌ కుటుంబం స్పందించింది.

Updated : 12 Jun 2024 17:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అది పేరుకే అమెరికా జట్టు.. ఆ టీమ్‌లో ఎక్కువగా ఆడేది భారత సంతతి ఆటగాళ్లే. మినీ టీమ్‌ఇండియాగా మారిన ఆ జట్టుతో నేడు రోహిత్‌ సేన తలపడుతోంది. ఈ నేపథ్యంలో పాక్‌పై అద్భుత బౌలింగ్‌తో ‘సూపర్‌ ఓవర్‌’ విక్టరీని యూఎస్‌ఏకు అందించిన ముంబయి కుర్రాడు సౌరభ్‌ నేత్రావల్కర్‌పైనే అందరి దృష్టి నెలకొంది. రోహిత్‌ సేనపై ఎలాంటి ప్రదర్శన చేస్తాడా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

మరోవైపు నేత్రావల్కర్‌ ప్రదర్శనపై అతడి కుటుంబం సంతోషం వ్యక్తంచేస్తోంది. అతడి ఆటతీరును మెచ్చుకుంటూ ఎన్నో ఫోన్‌కాల్స్‌ వస్తున్నట్లు తెలిపింది. మీడియా కూడా తమను సంప్రదిస్తున్నట్లు చెప్పింది. నేడు భారత్‌తో అమెరికా తలపడుతున్న నేపథ్యంలో ఏ జట్టుకు మద్దతివ్వాలన్న విషయంపై ఆ కుటుంబం సందిగ్ధంలో పడింది. దీనిపై అతడి సోదరి నిధి మాట్లాడుతూ.. నేత్రావల్కర్‌ గొప్పగా ఆడాలని.. టీమ్‌ఇండియా గెలవాలని కోరుకున్నారు.

‘‘మేం భారత జట్టునే సపోర్ట్‌ చేస్తాం. ఈ ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా గెలవాలని కోరుకుంటున్నాం. వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్‌ సమయంలో కూడా మేం ఆశించింది ఇదే. మేం ఇక్కడే పుట్టాం.. ఇక్కడే పెరిగాం. భారత క్రికెట్‌ జట్టును ప్రేమిస్తాం. ఈ ఒక్క మ్యాచే కాదు.. కప్‌ గెలవాలని ఆశిస్తున్నాం. అయితే.. నేత్రావల్కర్‌ కూడా అద్భుత ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాం. నిజంగా మేం ఈ మ్యాచ్‌ విషయంలో డైలమాలో ఉన్నాం’’ అని నిధి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని