IND vs USA: భారత్‌కు గట్టి పోటీనిస్తాం.. అతడి నుంచే మాకు కఠిన సవాల్‌: జోన్స్

వరుసగా విజయాలు సాధించిన జోరు మీదున్న భారత్, అమెరికా.. ఇవాళ ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.

Published : 12 Jun 2024 10:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) కెనడాను చిత్తు చేసి.. పాకిస్థాన్‌పై సంచలన విజయం సాధించిన యూఎస్‌ఏ ‘సూపర్ - 8’ రేసులో దూసుకుపోతోంది. గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌తో సమానంగా 4 పాయింట్లను ఖాతాలో వేసుకున్న యూఎస్ఏ నెట్‌రన్‌రేట్‌ వ్యత్యాసంతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇవాళ టీమ్‌ఇండియాతో అమెరికా (IND vs USA) కీలక పోరులో తలపడనుంది. ఇందులో భారత్‌ గెలిస్తే ‘సూపర్‌ - 8’కి చేరుకున్నట్లే. ఇటు యూఎస్‌ఏ విజయం సాధించినా ఆ జట్టే ముందడుగు వేస్తుంది. అప్పుడు పాక్‌ ఆశలు గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు. ఈ క్రమంలో తమ జట్టు ఆటతీరుపై అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

‘‘భారత జట్టుకు గట్టి పోటీనిస్తాం. నిర్భయంగా ఆడేస్తాం. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే విజయాలు సాధించగలిగాం. దాని కోసం తీవ్రంగా శ్రమించాం. ఇంకా చేస్తూనే ఉన్నాం. భారత జట్టులో ఏ ఆటగాడి నుంచి కఠిన సవాల్‌ ఎదురవుతుందని చెప్పమంటే సమాధానం కష్టమే. ప్రతి ప్లేయరూ అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తారు. బౌలింగ్‌లో మాత్రం జస్‌ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠినమే అని చెబుతా. పిచ్‌ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేం’’ అని జోన్స్‌ వెల్లడించాడు. 

కోహ్లీ అరంగేట్రం చేసిన రోజు ఇదే

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రోజు ఇదే. జూన్ 12, 2010లో భారత్‌ తరఫున జింబాబ్వేపై తొలి టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో థర్డ్‌ డౌన్‌లో వచ్చి 21 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో అదరగొట్టిన కోహ్లీ.. ఈసారి వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు సరైన ఇన్నింగ్స్‌ రాలేదు. రెండు మ్యాచుల్లో కలిపి ఐదు పరుగులే చేశాడు. ఇవాళ అమెరికాతో జరగనున్న మ్యాచ్‌లోనైనా కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.  అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు కోహ్లీ 119 టీ20ల్లో 4,042 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 55 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని