covid: అమ్మా, అక్కా.. ఈ రోజును ఊహించలేదు

ప్రాణాంతక కరోనా వైరస్‌ జీవితాలను ఛిద్రం చేస్తోంది. ప్రేమించే కుటుంబ సభ్యులను దూరం చేస్తోంది. కొవిడ్‌-19 టీమ్‌ఇండియా...

Published : 11 May 2021 01:06 IST

క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి కన్నీటి లేఖ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ జీవితాలను ఛిద్రం చేస్తోంది. ప్రేమించే కుటుంబ సభ్యులను దూరం చేస్తోంది. కొవిడ్‌-19 టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆమె తన మాతృమూర్తి, అక్కను శాశ్వతంగా కోల్పోయారు. భరించలేని బాధను పంటి బిగువన భరిస్తున్నారు. తాజాగా ఆమె వారితో తన అనుభవం గురించి పంచుకొంది. కష్టాల్లో తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలియజేసింది.

‘ప్రియమైన అమ్మ, అక్కకు..

గత కొన్ని రోజులుగా ఇంట్లో మా అందరి హృదయాలు ముక్కలయ్యాయి. మీరిద్దరే మన ఇంటికి పునాది. మీరిద్దరూ నాతో ఉండరన్న ఒకరోజు వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది నా గుండెను బద్దలు చేస్తోంది.

అమ్మా, నువ్వో ధైర్యవంతురాలైన బిడ్డను తయారు చేశావు. ప్రతి సందర్భంలో ప్రాక్టికల్‌గా ఉండేలా బోధించావు. నాకు తెలిసిన అందమైన, ఆనందమైన, నిస్వార్థమైన వ్యక్తివి నువ్వే. అక్కా.. అందరికన్నా నీకిష్టమైన వ్యక్తిని నేనే అని తెలుసు. నువ్వో యోధురాలివి. ఆఖరి వరకు పట్టు వదలొద్దన్న ప్రేరణ కల్పించావు.

నేను చేసిన ప్రతి పనిలో ఆనందం వెతికింది మీరిద్దరే. ఇద్దరు మాతృమూర్తులు ఉన్నారన్న అహం నాకెప్పుడూ ఉండేది. కానీ అహం ఎప్పటికీ మంచిది కాదని తెలుసు. మీతో గడిచిన ఆఖరి రోజులు ఎంతో ఉపశమనం కలిగించాయి. కానీ అవే ఆఖరివి అవుతాయని ఊహించలేదు.

మీరిద్దరూ వదిలి వెళ్లాక నా ప్రపంచం తలకిందులైంది. ఇక మనం కుటుంబం మళ్లీ ఒక్కటిగా ఎప్పుడుంటుందో తెలియదు. నేను చెప్పేదొక్కటే. నేను మిమ్మల్నిద్దర్నీ ప్రేమిస్తున్నాను. అలాగే ఎంతగానో మిస్సవుతున్నాను.

నాకు అందిన ప్రేమకు ధన్యవాదాలు

చివరికి నేను అందరినీ కోరేది ఒక్కటే, దయచేసి అంతా కొవిడ్‌ నిబంధనలు పాటించండి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ వైరస్‌ చాలా ప్రమాదకరం. నా కుటుంబం అంతా జాగ్రత్తగానే ఉంది. కానీ ఈ వైరస్‌ ఎలాగో మమ్మల్ని వెంటాడింది. 

నాలాగే ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వారి చుట్టే నా ఆలోచనలు తిరుగుతున్నాయి.

సురక్షితంగా ఉండి! ధైర్యంగా ఉండండి’

అని వేద కృష్ణమూర్తి ట్వీట్‌ చేసింది. కొవిడ్‌ 19తో ఆమె తన తల్లి, సోదరిని వారాల వ్యవధిలోనే కోల్పోయిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని