దుబాయ్‌కి ‘ధోనీ’ కూరగాయలు!

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటి నుంచి తన జీవితాన్ని బిజీగా గడుపుతున్నారు. గతేడాది రాంచీలో 2వేల కడక్‌నాథ్‌ కోళ్లతో పౌల్ట్రీ ఫాం ప్రారంభించగా..

Published : 05 Jan 2021 02:13 IST

రాంచీ: భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటి నుంచి తన జీవితాన్ని బిజీగా గడుపుతున్నారు. గతేడాది రాంచీలో 2వేల కడక్‌నాథ్‌ కోళ్లతో పౌల్ట్రీ ఫాం ప్రారంభించగా.. ఇప్పుడు తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన కూరగాయల ఎగుమతులపై దృష్టి సారించారు. తన వ్యవసాయ క్షేత్రంలో పండించిన స్ట్రాబెర్రీ, క్యాబేజీ, టమాట సహా ఇతర కూరగాయల్ని దుబాయ్‌కి ఎగుమతులు చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. 

ధోనీకి రాంచీలోని సెంబో గ్రామం సమీపంలో వ్యవసాయ క్షేత్రం ఉంది. అక్కడ పది ఎకరాల్లో సేంద్రీయ పద్దతుల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. కాగా తన క్షేత్రంలో పండించిన కూరగాయల్ని దుబాయ్‌కి ఎగుమతి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం ఆయన ఫాం ఫ్రెష్‌ అనే ఏజెన్సీని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బాధ్యతల్ని ఝార్ఖండ్‌ వ్యవసాయ శాఖ తీసుకుందని.. ఎగుమతులపై చర్చలు తుది దశలో ఉన్నాయని మీడియా వర్గాలు వెల్లడించాయి. కాగా ఇప్పటికే ధోనీ క్షేత్రంలో పండించే కూరగాయలకు రాంచీ మార్కెట్లో మంచి డిమాండు ఉంది. మరోవైపు ధోనీ ప్రస్తుతం నూతన సంవత్సర వేడుకల నిమిత్తం తన భార్య సాక్షితో కలిసి దుబాయ్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి

ఆసీస్‌ను చదివిన అజింక్యా
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని