Team India:‘టీమ్‌ఇండియాలో భారీ మార్పులు చేయాల్సిన అవసరముంది’

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ వరసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలుకావడంతో విమర్శల పాలవుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ వెంకటేష్ ప్రసాద్‌ టీమ్‌ఇండియాకు పలు కీలక సూచనలు చేశాడు.

Published : 09 Dec 2022 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వడంతో విమర్శల పాలవుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ వెంకటేష్ ప్రసాద్‌ టీమ్‌ఇండియాకు పలు కీలక సూచనలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడే విధానంలో టీమ్ఇండియాలో భారీ మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. 2015 వన్డే ప్రపంచకప్‌లో  గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టిన తర్వాత తమ క్రికెట్‌లో పెను మార్పులు తీసుకొచ్చిన ఇంగ్లాండ్‌ను చూసి భారత్ నేర్చుకోవాలన్నాడు. 

‘ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అనేక రంగాల్లో ఆవిష్కరణలు చేస్తోంది. కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడే విషయానికొస్తే మన విధానం దశాబ్దం నాటిది. 2015 ప్రపంచకప్‌లో మొదటి రౌండ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమణ తర్వాత ఇంగ్లాడ్ కఠినమైన మార్పులు చేసింది. ఇంగ్లాండ్‌లాగా పటిష్టమైన జట్టుగా మారడానికి టీమ్‌ఇండియా కఠినమైన మార్పులు తీసుకు రావాల్సిన అవసరముంది. భారత టీ20 లీగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి మనం (టీమ్‌ఇండియా) టీ20 ప్రపంచకప్‌ గెలవలేదు. గత 5 ఏళ్లలో వన్డేల్లో టీమ్‌ఇండియా ఎన్నో ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయాలు సాధించడంతోపాటు కొన్నిసార్లు పేలవ ప్రదర్శనలు చేసింది. అయినా, చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోలేదు. ఈ విధానం మారాలి’ అని వెంకటేష్ ప్రసాద్ సూచించాడు. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్‌, టీమ్‌ఇండియా మధ్య డిసెంబరు 10న  మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపొంది గత ఓటముల నుంచి ఉపశమనం పొందాలని భారత్‌ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని