Shreyas Iyer : వారంతా ఉండగా.. టీ20 జట్టులో శ్రేయస్‌ ఎందుకు?: భారత మాజీ పేసర్‌

నిలకడగా ఆడే శ్రేయస్ అయ్యర్‌ విండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అంతకుముందు వన్డే సిరీస్‌లో అద్భుతంగా ఆడిన అయ్యర్ ఈసారి మాత్రం పరుగులు చేసేందుకు..

Published : 31 Jul 2022 01:39 IST

సెలెక్షన్ కమిటీని ప్రశ్నించిన వెంకటేశ్‌ ప్రసాద్

ఇంటర్నెట్ డెస్క్‌: నిలకడగా ఆడే శ్రేయస్ అయ్యర్‌ విండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. అంతకుముందు వన్డే సిరీస్‌లో అద్భుతంగా ఆడిన అయ్యర్ ఈసారి మాత్రం పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. విరాట్ కోహ్లీ గైర్హాజరీతో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్‌ నాలుగు బంతులను ఎదుర్కొని డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో శ్రేయస్‌ను టీ20లకు ఎంపిక చేయడంపై టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ వెంకటేశ్ ప్రసాద్ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. సెలెక్షన్‌ కమిటీ తీరును తప్పుబట్టాడు. అయితే వెంకటేశ్‌ ప్రసాద్‌ ట్వీట్‌కు క్రికెట్ అభిమాని ప్రతిస్పందించగా.. దానికీ ఈ భారత మాజీ ఆటగాడు సమాధానం ఇచ్చాడు. 

‘‘సెలెక్షన్‌ కమిటీలో కొంతమంది వచ్చే టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని జట్టును తయారు చేస్తున్నామని గతంలో చెప్పారు. అయితే ఇప్పటికే సంజూ శాంసన్‌, దీపక్ హుడా, ఇషాన్ కిషన్‌ వంటి ప్లేయర్లు టీ20 టీమ్‌లో ఉన్నప్పుడు శ్రేయస్‌ అయ్యర్‌ ఉండటం సరిగా అనిపించలేదు. ఎందుకంటే ప్రపంచకప్‌ జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ కచ్చితంగా ఉంటారు. అందుకే సరైన బ్యాలెన్స్‌ చేయడానికి మిగతా సభ్యుల ఎంపికపై దృష్టిపెట్టాలి’’ అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు. అయితే వెంకటేశ్‌ ప్రసాద్ చేసిన ట్వీట్‌కు ఓ క్రికెట్ అభిమాని స్పందిస్తూ.. ‘ఈ మ్యాచ్‌ ముందు వరకు శ్రేయస్‌ చాలా బాగా ఆడాడు.. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆడలేకపోయాడు’ అని రీట్వీట్ చేశాడు. అభిమాని ట్వీట్‌కు వెంకటేశ్‌ ప్రసాద్ సమాధానం ఇచ్చాడు. ‘‘ అతడు (శ్రేయస్) 50 ఓవర్ల క్రికెట్‌లో చాలా బాగా ఆడాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో శ్రేయస్‌ కంటే ఉత్తమ ఆటగాళ్లు ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం. టీ20ల్లోకి రావాలంటే శ్రేయస్‌ తన నైపుణ్యాలను ఇంకా మెరుగుపరుచుకోవాలి’’ అని మరో పోస్టు చేశాడు. వెంకటేశ్ ప్రసాద్ వ్యాఖ్యలపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరేమో మద్దతు తెలపగా.. మరికొందరు ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీని కూడా ఇలా చూడాలి కదా అని ప్రశ్నలు సంధించారు. 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని