Asia Cup 2023: ‘వారు నరకానికి పోవాలనుకోవడం లేదు’’..: వెంకటేశ్‌ ప్రసాద్‌

ఆసియా కప్ 2023 (Asia Cup 2023) వివాదం కొనసాగుతూనే ఉంది. వేదికపై సందిగ్ధత తొలిగిపోలేదు. అయితే పాక్‌ నుంచి వేదిక మారిందనే సమాచారం మాత్రం మీడియాలో కథనాలు వస్తున్నాయి. అధికారికంగా మాత్రం మార్చిలోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రకటించనుంది.

Published : 08 Feb 2023 01:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్ 2023 టోర్నమెంట్ వ్యవహారంలో టీమ్‌ఇండియాను ఉద్దేశిస్తూ పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్‌ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మియాందాద్‌ వ్యాఖ్యలకు భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ఇంతకీ మియాందాద్‌ ఏమన్నాడు..? వెంకటేశ్‌ ప్రసాద్‌ ఇచ్చిన కౌంటర్ ఏంటంటే..?

పాకిస్థాన్‌ వేదికగా ఆసియా కప్ జరిగితే తాము పాల్గొనబోమని బీసీసీఐ కార్యదర్శి జై షా అప్పట్లో వ్యాఖ్యానించారు. అదే జరిగితే వన్డే ప్రపంచకప్‌లో పాక్‌ ఆడేది లేదని అప్పటి పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్‌ రమీజ్‌ రజా స్పష్టం చేశాడు. ఇప్పుడు పీసీబీ ఛైర్మన్‌గా వచ్చిన నజామ్‌ సేథీ కూడా తమ ఉద్దేశం ఏంటో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) భేటీలో తెలిపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్‌ కూడా తన యూట్యూబ్ ఛానల్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్ ఇక్కడకు రాకపోతే.. మేం భయపడేది లేదు అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నా. మా క్రికెట్ ఏదో మేం ఆడుకుంటాం. ఇలాంటి వాటన్నింటినీ నియంత్రించాల్సిన బాధ్యత అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)దే. అలా చేయలేకపోతే పాలకమండలి ఉండటం వృథా. తప్పకుండా ఆడాల్సిందే. వారు ఎందుకు ఆడరు..? క్రికెట్ ఆడేందుకు పాకిస్థాన్‌ రాకూడదని భావిస్తే భారత్ నరకానికి వెళ్లొచ్చు. పాక్‌ క్రికెట్ మనుగడ కోసం భారత్‌ అవసరం మాకు లేదు’’ అని వ్యాఖ్యానించాడు. 

జావెద్ మియాందాద్‌ వ్యాఖ్యలపై భారత మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ ఒకే ఒక్క వాక్యంలోనే ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ‘‘అయితే వారు(టీమ్‌ ఇండియా) నరకానికి వెళ్లడానికి అంగీకరించడం లేదు’’ అని ట్వీట్ చేశాడు. పరోక్షంగా దాయాది దేశాన్ని ఉద్దేశించి వెంకటేశ్‌ ప్రసాద్ పేర్కొనడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని