
T20 World Cup: పాక్ ఓటమితో మైదానంలో కన్నీటి పర్యంతమైన అభిమాని.. వీడియో వైరల్
ఇంటర్నెట్ డెస్క్: మమూలుగా ద్వైపాక్షిక సిరీస్‌ల్లోని మ్యాచ్‌ల్లో తమ అభిమాన జట్టు ఓటమిపాలైతేనే చాలామంది జీర్ణించుకోలేరు. మైదానంలోనే కంటతడి పెడుతుంటారు. ఇలాంటి ఘటనలు చాలు వారికి తమ అభిమాన జట్టుపై ఎంతంటి ప్రేమాభిమానాలు ఉన్నాయో చెప్పడానికి. అలాంటిది ఐసీసీ టోర్నీలో ముఖ్యంగా టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో మనం అమితంగా ఆరాధించే టీం పరాజయం పాలైతే తట్టుకోవడం ఏ దేశ క్రికెట్ అభిమానికైనా చాలా కష్టమైన పని. అయితే.. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే.. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీస్‌లో ఇటువంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు పూర్తయ్యేసరికి పాక్ వైపే విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే, అప్పుడు క్రీజులో ఉన్న స్టాయినిస్, మాథ్యూ వేడ్ గేర్లు మార్చి ఆడారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. గెలుస్తుందనుకున్న పాకిస్థాన్‌కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఒక ఓవర్ మిగిలుండగానే 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేసింది. దీంతో పాక్ ఫైనల్‌కు చేరకుండానే ఇంటిబాట పట్టింది. విజయం సాధిస్తుందనకున్న పాక్ అనుహ్యాంగా ఓటమిపాలుకావడంతో మైదానంలో ఉన్న మోమిన్ సాకిబ్ అనే ఆ దేశ క్రికెట్ అభిమాని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
‘‘ఇప్పుడు ఇంటికి వెళ్లాలని అనిపించడం లేదు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయింది కాబట్టి సహజంగానే నాకు బాధ కలుగుతుంది. కానీ, మా ఆటగాళ్లు చాలా బాగా ఆడారు. వరుస మ్యాచ్‌ల్లో గెలిచారు. జట్టుపై నాకు ఎలాంటి కోపం లేదు. వాళ్లు మా ఛాంపియన్లు. వాళ్లంటే మాకెంతో ఇష్టం. ఈ మ్యాచ్‌లోనూ బాగా ఆడారు. ఏదేమైనా మేం వాళ్లను ప్రేమిస్తూనే ఉంటాం’ అని మోమిన్ సాకిబ్ ఆ వీడియోలో అన్నాడు.
ఇవీ చదవండి
Advertisement