Virat Kohli: 14 పరుగులు చేస్తే చాలు.. మరో రికార్డు..

టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు చెందిన ఓ రికార్డుకు అధిగమించే పనిలో ఉన్నాడు. కేప్‌టౌన్‌ వేదికగా మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో...

Published : 11 Jan 2022 01:13 IST

కేప్‌టౌన్‌‌: టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం.. హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు చెందిన ఓ రికార్డుకు అధిగమించే పనిలో ఉన్నాడు. కేప్‌టౌన్‌ వేదికగా మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే మూడో టెస్టులో అతడు మరో 14 పరుగులు సాధిస్తే.. ఆ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌ జాబితాలో రెండో స్థానంలో నిలుస్తాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ తెందూల్కర్‌ ఇప్పటికే దక్షిణాఫ్రికాలో 15 టెస్టులు ఆడగా.. 1,161 పరుగులతో అందరికన్నా ముందున్నాడు. అందులో మూడు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి. తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ 11 టెస్టుల్లో 624 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్‌ ఇప్పటివరకు సఫారీ గడ్డపై 6 టెస్టులే ఆడగా.. 611 పరుగులు సాధించి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. అందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.

వెన్నునొప్పి కారణంగా రెండో టెస్టులో ఆడలేకపోయిన కోహ్లీ ఇప్పుడు మూడో టెస్టుకు అందుబాటులో ఉండేలా కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతడు ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. దీంతో కేప్‌టౌన్‌లో జరిగే చివరి టెస్టులో విరాట్‌ ఆడే వీలుంది. ఈ క్రమంలోనే ద్రవిడ్‌ను అధిగమించే అవకాశం ఉంది. అంతకుముందు సెంచూరియన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ (35, 18) పరుగులే చేసి నిరాశపరిచాడు. మరోవైపు గత రెండేళ్లకు పైగా ఒక్క సెంచరీ సాధించకపోవడంతో చివరి టెస్టులోనైనా దాన్ని అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ అదే జరిగి టీమ్‌ఇండియా విజయం సాధిస్తే కోహ్లీసేన దక్షిణాఫ్రికా గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం టెస్టు హోదా కలిగిన జట్లలో దక్షిణాఫ్రికాలో ఒక్కటే భారత్‌ టెస్టు సిరీస్‌ గెలవలేదు. దీంతో ఇప్పుడు అది నిజమైతే కోహ్లీ ఘనతల్లో మరో కలికితురాయి చేరుతుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్‌లో రెండు టెస్టులు పూర్తవ్వగా భారత్‌, దక్షిణాఫ్రికా చెరో మ్యాచ్‌ గెలిచాయి. దీంతో సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. మూడో మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే సిరీస్ వాళ్లదే సొంతమవుతుంది. దీంతో ఎలాగైనా చివరి టెస్టు గెలవాలని భారత్‌ ఆసక్తిగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని