T20 World Cup:‘ఇషాన్‌ కిషన్‌ అందు కోసం సిద్ధంగా ఉండు’

ఇషాన్‌ కిషన్‌.. ముంబయి ఇండియన్స్‌ కీలక ఆటగాళ్లలో ఒకడు. అయితే, ఐపీఎల్ రెండో దశలో కొన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమ్‌ఇండియాకు

Published : 09 Oct 2021 14:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇషాన్‌ కిషన్‌.. ముంబయి ఇండియన్స్‌ కీలక ఆటగాళ్లలో ఒకడు. అయితే, ఐపీఎల్ రెండో దశలో కొన్ని మ్యాచ్‌ల్లో వరుసగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. టీమ్‌ఇండియాకు ఎంపికైన తర్వాత ఇషాన్‌ రిలాక్స్‌ అయ్యాడని, అందుకే పరుగులు చేయలేకపోతున్నాడని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శించారు. వీటికి సమాధానం చెబుతున్నట్లుగా సన్‌రైజర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇషాన్‌ చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే 84 పరుగులు బాదేశాడు. ఇందులో 11 ఫోర్లు, 4 సిక్స్‌లున్నాయి. అంతకు ముందు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 25 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. 

కాగా, మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కాబోతోంది. ఈ మెగా టోర్నీకి ఇషాన్‌ కిషన్ ఎంపికయ్యాడు. ఫామ్‌ అందుకున్న ఈ యువ ఆటగాడు టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఇషాన్‌ కిషనే చెప్పడం గమనార్హం. సన్రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిసిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. ‘‘నేను విరాట్ భాయ్‌( విరాట్‌ కోహ్లి)తో చాట్‌ చేశాను. జస్ప్రీత్ బుమ్రా కూడా నాకు సహాయం చేశాడు. హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యతోపాటు ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా నిలిచారు. ఇది నేర్చుకునే దశ అని, ఐపీఎల్‌లో చేసిన తప్పులను తెలుసుకుని వాటిని టీ20 ప్రపంచ కప్‌లో పునరావృతం కాకుండా చూసుకోవాలని వారు నాతో చెప్పారు’’ అని అన్నాడు. అనంతరం టీ20 ప్రపంచకప్ గురించి మాట్లాడుతూ.. ‘‘నువ్వు టీ20 మెగా టోర్నీకి ఓపెనర్‌గా ఎంపిక అయ్యావు. అందుకోసం సిద్ధంగా ఉండాలి. ఏ సవాలునైనా ఎదుర్కొనే విధంగా పూర్తిస్థాయిలో సమయాత్తం అయి ఉండు అని విరాట్ కోహ్లి నాతో చెప్పారు’ అని కిషన్‌ వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని