Virat Kohli: కోహ్లీ కొత్త రికార్డు.. టీ20ల్లో 4వేల పరుగులు చేసిన తొలి ఆటగాడు..

పరుగులు యంత్రం, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ ఖాతాలో మరో అరుదైన ఘనత. అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కింగ్‌ చరిత్ర సృష్టించాడు.

Published : 10 Nov 2022 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో సూపర్‌ ఫామ్‌తో చెలరేగి ఆడుతున్న పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ పొట్టి ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో 4వేల పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. అడిలైడ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న సెమీఫైనల్‌ మ్యాచ్‌లో విరాట్‌ ఈ రికార్డును అందుకున్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటికే అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్న కోహ్లీ.. నేటి మ్యాచ్‌లో 4వేల మైలురాయిని దాటాడు. మొత్తంగా 115 మ్యాచ్‌ల్లో 4008 పరుగులతో ఈ ఫార్మాట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో ఒక సెంచరీ, 36 అర్ధశతకాలు ఉన్నాయి. కోహ్లీ తర్వాత 3,853 పరుగులతో టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌ ఆటగాడు గప్తిల్(3497), పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(3323), ఐర్లాండ్‌ ఆటగాడు స్టిర్లింగ్‌ (3181) ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఇక, ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్‌ అవతరించిన విషయం తెలిసిందే. శ్రీలంక మాజీ కెప్టెన్‌ జయవర్దనే(1,016)ను వెనక్కి నెట్టి 1,141 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుత టోర్నీలోనూ అత్యధిక పరుగుల రికార్డు విరాట్‌దే. 6 మ్యాచ్‌ల్లో 296 పరుగులు సాధించాడు. ఇక టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో 100 బౌండరీలు కొట్టిన ఆటగాడు కూడా కోహ్లీనే కావడం విశేషం. 2014, 2016 టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన చేసి ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని