IND vs HK : సూర్యకుమార్‌కు విరాట్ ‘టేక్‌ ఏ బౌ’.. వైరల్‌గా మారిన వీడియో!

సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌కు పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఫిదా అయిపోయాడు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌కి ‘టేక్‌ ఏ బౌ’ చెప్పాడు. ఇదంతా ఆసియా కప్‌లో భాగంగా..

Updated : 01 Sep 2022 11:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌కు పరుగుల రారాజు విరాట్ కోహ్లీ ఫిదా అయిపోయాడు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌కి ‘టేక్‌ ఏ బౌ’ చెప్పాడు. ఈ ఘటన ఆసియా కప్‌లో భాగంగా హాంకాంగ్‌తో ఆడిన మ్యాచ్‌లో చోటుచేసుకొంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 192/2 భారీ స్కోరు సాధించింది. అనంతరం హాంకాంగ్ 152/5కే పరిమితమైంది. దీంతో 40 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించడంలో సూర్యకుమార్‌ యాదవ్‌ (68*) కీలక పాత్ర పోషించాడు. 

ఓపెనింగ్‌ బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ (21) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించగా.. కేఎల్ రాహుల్ (36) మాత్రం ఆచితూచి ఆడాడు. వీరిద్దరూ పెవిలియన్‌కు చేరే సమయానికి టీమ్‌ఇండియా స్కోరు 94/2 (13 ఓవర్లకు). హాంకాంగ్‌ బౌలర్లు కాస్త పొదుపుగానే బౌలింగ్‌ చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కూడా నెమ్మదిగానే తన ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. క్రీజ్‌లో కుదురుకునేందుకు సమయం తీసుకొన్నాడు. అయితే, సూర్యకుమార్‌ యాదవ్ మాత్రం మొదటి నుంచి దూకుడుగా ఆడాడు.  వీరిద్దరూ కలిసి కేవలం ఏడు ఓవర్లలోనే మూడో వికెట్‌కు 98 పరుగులను జోడించారు. 

మరీ ముఖ్యంగా భారత ఇన్నింగ్స్‌లోని చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌ వీరవిహారం చేశాడు. మొత్తం నాలుగు సిక్సర్లతో సహా 26 పరుగులను రాబట్టాడు. తొలి మూడు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్‌ ఆరు సిక్సర్ల రికార్డును అందుకొంటాడని అభిమానులు భావించారు. అయితే, హాంకాంగ్‌ బౌలర్‌ హరూర్‌ అర్షద్‌ తెలివిగా స్లో బౌన్సర్‌ను విసిరాడు. సూర్యకుమార్‌ ఆ బంతిని కొట్టేందుకు ప్రయత్నించినా బ్యాట్‌కు తాకలేదు. మరుసటి బాల్‌ను కూడా స్లో బౌన్సర్‌గా సంధించాడు. ఈ సారి మాత్రం సూర్యకుమార్‌ లెగ్‌సైడ్‌ సిక్సర్‌ బాదాడు. ఇక చివరి బంతికి షాట్‌కు ప్రయత్నించినా రెండు పరుగులే లభించాయి. ఈ క్రమంలో కేవలం 22 బంతుల్లోనే సూర్యకుమార్‌ యాదవ్‌ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకొన్నాడు. దీంతో ఇన్నింగ్స్‌ ముగిశాక సూర్యకుమార్‌ను అభినందిస్తూ విరాట్ కోహ్లీ ‘టేక్‌ ఏ బౌ’ చెప్పాడు. కోహ్లీ నుంచి ఇలాంటి అభినందన వస్తుందని ఊహించలేదని, ఎంతో ఆనందగా ఉందని సూర్యకుమార్‌ తెలిపాడు. ఈ వీడియోను స్పోర్ట్స్‌ ఛానెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఆ వీడియోను మీరూ వీక్షించండి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని