Virat: కోహ్లీ ఇలా సాధిస్తాడని ఊహించారా? 

వచ్చే ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ శతకం సాధిస్తాడని పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ సల్మాన్‌ బట్‌ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ మూడంకెల స్కోర్‌ అందుకోక దాదాపు రెండేళ్లు కావొస్తోంది...

Updated : 23 May 2021 09:46 IST

టీమ్‌ఇండియా కెప్టెన్‌పై పాక్ మాజీ సారథి సల్మాన్‌ బట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: వచ్చే ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ శతకం సాధిస్తాడని పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ సల్మాన్‌ బట్‌ ధీమా వ్యక్తం చేశాడు. కోహ్లీ మూడంకెల స్కోర్‌ అందుకోక దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అతడి కెరీర్‌లో ఇంత వ్యత్యాసం రావడం ఇదే తొలిసారి. 2019 నవంబర్‌లో చివరిసారి బంగ్లాదేశ్‌పై టెస్టు మ్యాచ్‌ సందర్భంగా సెంచరీ కొట్టాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 70వ సారి ఆ ఘనత నమోదు చేశాడు. అప్పటి నుంచీ కోహ్లీ మరో శతకం బాదలేదు. ఈ నేపథ్యంలోనే సల్మాన్‌ తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో మాట్లాడుతూ భారత సారథిపై ప్రశంసలు కురిపించాడు.

‘కోహ్లీ ఇప్పటికే అనేక రికార్డులు బద్దలుకొట్టాడు. ఈ వయసులో ఒక ఆటగాడు 70 శతకాలు సాధిస్తాడని ఎవరైనా ఊహించారా? ఇప్పుడు అతడున్నంత ఫిట్‌నెస్‌తో ఎవరైనా ఉంటారని అనుకున్నారా? లేదా అతడున్న ఫామ్‌ గురించి ఆలోచించారా? ప్రస్తుతం కోహ్లీ ఛేదనల్లో 90 స్ట్రైక్‌రేట్‌తో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో 50కి పైగా సగటుతో కొనసాగుతున్నాడు. ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించాడు. ఇంకో శతకం సాధిస్తే ఎవరు అడ్డుకుంటారు? నిజం చెప్పాలంటే అతడు ఆడే తర్వాతి మ్యాచ్‌లోనైనా లేదా ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లోనైనా కచ్చితంగా సెంచరీ కొడతాడు. ఏడాదికి పైగా సెంచరీ సాధించకపోయినా అతడు చేసిన పరుగులు చూడండి మీకే అర్థమవుతుంది. కోహ్లీ సెంచరీ కొట్టకపోతే అసలు పరుగులే చేయలేదని మనం అనుకుంటాం. మరో శతకం కొట్టడానికి అవసరమైన అవకాశాలు మెండుగా ఉన్నాయి. అది కేవలం సమయంతో ముడిపడి ఉంది’ అని సల్మాన్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని