Virat Kohli: కోహ్లీమరో ఘనత.. టెస్టుల్లో వందో క్యాచ్‌ పట్టిన వీడియో చూడండి

టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ కెరీర్‌లో మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో వందో క్యాచ్‌ అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఆరో టీమ్‌ఇండియా ఆటగాడిగా (వికెట్‌ కీపర్లు కాకుండా) రికార్డులకెక్కాడు...

Updated : 13 Jan 2022 12:25 IST

కేప్‌టౌన్‌: టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో వందో క్యాచ్‌ అందుకున్నాడు. ఈ రికార్డు సాధించిన ఆరో టీమ్‌ ఇండియా ఆటగాడిగా (వికెట్‌ కీపర్లు కాకుండా) రికార్డులకెక్కాడు. బుధవారం దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా మహ్మద్ షమి వేసిన 56వ ఓవర్‌ రెండో బంతికి తెంబా బవుమా (28) ఇచ్చిన ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌ క్యాచ్‌ను ఎంతో చాకచక్యంగా అందుకొన్నాడు. రెండో స్లిప్‌లో ఉన్న విరాట్‌ తన ఎడమచేతి వైపు డైవ్‌చేస్తూ నేలను తాకబోయిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. దీంతో అతడు టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో వందో క్యాచ్‌ అందుకున్న ఆరో ఫీల్డర్‌గా నిలిచాడు.

టీమ్‌ఇండియా తరఫున అత్యధికంగా రాహుల్‌ ద్రవిడ్‌ 209 టెస్టు క్యాచ్‌లు అందుకున్నాడు. హైదరాబాద్‌ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ 135 క్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ 115, లిటిల్‌ మాస్టర్‌ సునీల్‌ గావస్కర్‌ 108, మణికట్టు స్పెషలిస్టు మహ్మద్‌ అజహరుద్దీన్‌ 105, విరాట్‌ కోహ్లీ 100, అజింక్య రహానె 99, వీరేందర్‌ సెహ్వాగ్‌ 90 క్యాచ్‌లతో వరుస స్థానాల్లో ఉన్నారు. కాగా, విరాట్‌ పట్టిన ఈ క్యాచ్‌ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అభిమానులు దీన్ని ఇతరులకు షేర్‌ చేస్తూ ఆనందిస్తున్నారు. మీరూ కోహ్లీ వందో క్యాచ్‌ను ఎలా పట్టాడో ఓ లుక్కేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు