T20 World Cup: అలాంటి వారే ట్రోల్స్‌ చేసేది: విరాట్ కోహ్లీ

టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మీద భారత్‌ ఓడిపోవడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ...

Published : 31 Oct 2021 01:47 IST

షమీపై ట్రోల్స్‌ను ఖండించిన టీమ్‌ఇండియా కెప్టెన్‌

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ మీద భారత్‌ ఓడిపోవడంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ ఓటమికి కారణమంటూ మహమ్మద్‌ షమీపై నెటిజన్లు అసభ్యకరమైన రీతిలో ట్రోల్స్‌ చేస్తున్నారు. అయితే టీమ్‌ఇండియా సహా మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు షమీకి బాసటగా నిలిచారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియా ట్రోల్స్‌పై భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరోసారి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. వినోదం కోసం సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేసే వ్యక్తులకు ధైర్యం ఉండదని, మనిషి సామర్థ్యం అత్యల్ప స్థాయికి పడిపోయినప్పుడే ఇలాంటి ట్రోల్స్‌ చేస్తుంటారని విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. టీమ్‌ఇండియా ఓటమికి మహమ్మద్‌ షమీని బాధ్యుడిని చేస్తూ ట్రోల్స్‌ చేయడాన్ని ఖండించాడు. క్రికెటర్లు, క్రీడాకారులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌ వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టడం నెటిజన్లకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారిందని.. ఇది విచారకరమైన పరిస్థితులకు దారితీస్తుందని పేర్కొన్నాడు. 

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో కీలక పోరులో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ క్రమంలో కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ షమీపై సోషల్‌ మీడియా ట్రోల్స్‌ను తీవ్రంగా ఖండించాడు. ‘‘మేం మైదానంలో ఆడటానికి మంచి కారణం ఉంది. సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ధైర్యంలేని వ్యక్తులు మాత్రమే ట్రోల్స్‌ చేస్తున్నారు. వారికి ఎవరితోనూ వ్యక్తిగతంగా మాట్లాడే ధైర్యం ఉండదు. వారు తమ గుర్తింపును దాచుకుని మరీ సోషల్‌ మీడియా ద్వారా దాడి చేస్తుంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం క్రీడాకారులు, క్రికెటర్లపై ట్రోల్స్‌ చేయడం సరదా అయిపోయింది. ఈ డ్రామా అంతా ఫ్రస్ట్రేషన్‌ నుంచి వచ్చింది. ఆత్మవిశ్వాసం లోపించడం, దయాగుణం లేకపోవడంపై ఇది ఆధారపడి ఉంటుంది. అందుకే ఇతరులను ట్రోల్స్‌ చేయడం వినోదంగా భావిస్తారు. ఇలాంటప్పుడే మేమంతా ఒక బృందం మాదిరిగా ఎలా కలిసి ఉండాలో అర్థం చేసుకున్నాం. ఒకరికొకరం అండగా నిలుస్తాం. మైదానంలో ఎలా మా బలాలను వినియోగించాలో దానిపైనే దృష్టి పెడతాం’’ అని విరాట్ కోహ్లీ వివరించాడు. ఇక కివీస్‌తో మ్యాచ్‌ విషయానికొస్తే.. టీమ్‌ఇండియా బ్యాటర్లు న్యూజిలాండ్‌ పేస్‌ దాడిని సమర్థంగా ఎదుర్కొంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. పాక్‌ బౌలర్‌ షాహీన్‌ అఫ్రిది మాదిరిగా తమను ఇబ్బందిపెట్టాలని చూస్తే మాత్రం ట్రెంట్‌బౌల్ట్‌కు సరైన సమాధానం ఇస్తామని స్పష్టం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని