CWG 2022: ‘‘మీరెంతో గొప్ప పురస్కారాలు తెచ్చారు’’

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ 61 పతకాలతో నాలుగో స్థానంతో ముగించింది. అందులో..

Published : 10 Aug 2022 01:41 IST

కామన్వెల్త్‌ అథ్లెట్లకు కోహ్లీ శుభాకాంక్షలు

ఇంటర్నెట్ డెస్క్‌: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ 61 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. అందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. వెయిట్‌లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌ సహా స్క్వాష్‌, లాంగ్‌జంప్‌, టీటీ విభాగాల్లో క్రీడాకారులు అత్యుత్తమంగా రాణించి బంగారు పతకాలను సాధించారు. లాన్‌బౌల్స్, ట్రిపుల్‌ జంప్, క్రికెట్‌ క్రీడల్లో తొలిసారి పతకాల పంట పండింది. అత్యధికంగా రెజ్లింగ్‌లో 12 పతకాలను భారత రెజ్లర్లు పట్టేశారు. వెయిట్‌ లిఫ్టింగ్‌లో 10, అథ్లెటిక్స్‌లో 8, బ్యాడ్మింటన్‌లో ఆరు పతకాలను అందుకున్నారు. జూడోలో మూడు, స్వ్కాష్‌లో రెండు, హాకీలో రెండు పతకాలు రావడం విశేషం. ఈ క్రమంలో భారత అథ్లెట్లను అభినందిస్తూ టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ట్విటర్ వేదికగా అభినందనలు కురిపించాడు. ‘‘మన దేశం కోసం ఎంతో విలువైన పురస్కారాలను అందించారు. విజేతలతోపాటు కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్న అథ్లెట్లకు కంగ్రాట్స్‌. మేమెప్పుడూ గర్వపడుతూనే ఉంటాం. జైహింద్’’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు.

షూటింగ్‌, ఆర్చరీ వంటి క్రీడలు లేకపోయినా ఈసారి భారత్‌ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనే ఇచ్చారు. 2018 కామన్వెల్త్‌ ఫలితాలకు దగ్గరగా రావడం విశేషం. అప్పుడు కూడా 64 పతకాలతో (25 స్వర్ణాలు, 19 రజతాలు, 20 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచింది.  ఈసారి అస్ట్రేలియా (178) పతకాల సంఖ్య కూడా తగ్గడం విశేషం. అయితే ఇంగ్లాండ్‌, కెనడా మాత్రం తమ స్వర్ణాల సంఖ్యను పెంచుకుని దూసుకొచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని