IND vs AUS: మా మధ్య పోటీ మాత్రం మామూలుగా ఉండదు: స్టొయినిస్‌

భారత్‌ - ఆసీస్‌ మధ్య ఫిబ్రవరిలో టెస్టు సిరీస్‌ ప్రారంభమవనున్న నేపథ్యంలో కోహ్లి వంటి ఆటగాడు తమ జట్టుకు ప్రమాదకరమని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ పేర్కొన్నాడు.

Published : 28 Jan 2023 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫిబ్రవరిలో భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఆట తమకు అత్యంత ప్రమాదకరమని ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ పేర్కొన్నాడు. అయితే తమ జట్టు బలంగా ఉందని, ఇరుజట్ల మధ్య పోటీ గొప్పగా ఉండబోతోందని తెలిపాడు. ఈ ఏడాది ట్రోఫీని కచ్చితంగా సొంతం చేసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత సిరీస్‌లో అద్బుతంగా రాణించిన రిషభ్‌పంత్‌ రోడ్డుప్రమాదానికి గురై సిరీస్‌కు దూరమవడం బాధాకరమన్నాడు.

‘‘భారత్‌లో స్పిన్‌ను ఎదుర్కొని భారీ స్కోరు రాబట్టడం అంత సులభం కాదు. ముఖ్యంగా రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా వంటి బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. కానీ మా జట్టు బలంగా ఉంది. మేము కూడా స్పెషలిస్ట్‌ స్పిన్నర్లతో బరిలోకి దిగబోతున్నాం. ఇరుజట్ల మధ్య పోటీ మామూలుగా ఉండదు. కోహ్లీ ఒక ప్రపంచ స్థాయి ఆటగాడు. అతడు ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక టెస్టుల్లో అతడికి తిరుగేలేదు. ప్రస్తుతం అతడిని ఎదుర్కోవడం మాకు సవాలుగా మారింది. అయినప్పటికీ ఈసారి ట్రోఫీని మాత్రం వదులుకోం. రిషభ్‌పంత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని మార్కస్‌ తెలిపాడు. భారత్‌ - ఆస్ట్రేలియా తొలి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్‌పుర్‌ వేదికగా ప్రారంభం కానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని