Virat Kohli: కోహ్లీ అధికారం కావాలనుకోడు.. ఆటను ఆస్వాదిస్తాడు: సంజయ్‌ మంజ్రేకర్

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టుపై నాయకత్వం, అధికారం కావాలని కోరుకోడని భారత మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ (Sanjay Manjrekar) అభిప్రాయపడ్డాడు.

Published : 20 Sep 2023 01:31 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) జట్టుపై నాయకత్వం, అధికారం కావాలని కోరుకోడని భారత మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్ (Sanjay Manjrekar) అభిప్రాయపడ్డాడు. సచిన్ తెందూల్కర్ మాదిరిగానే కోహ్లీ కూడా క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తాడని పేర్కొన్నాడు. ఆసియా కప్‌ను సాధించి మంచి ఊపుమీదున్న టీమ్‌ఇండియా సెప్టెంబరు 22 నుంచి ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని పనిభార నిర్వహణలో భాగంగా ఈ సిరీస్‌లో మొదటి రెండు వన్డేలకు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యలకు విశ్రాంతినిచ్చారు.

‘వన్డే ప్రపంచ కప్‌ సెమీస్‌కు ఈ నాలుగు జట్లు’.. రజనీకాంత్‌కు గోల్డెన్‌ టికెట్‌

‘‘సచిన్ టెందూల్కర్‌, విరాట్ కోహ్లీ మధ్య ఒక పోలిక ఉంది. ఇద్దరూ క్రికెట్ ఆడటాన్ని ఆస్వాదిస్తారు. మైదానంలో ఉండాలనుకుంటున్నారు. కోహ్లీ అధికారం లేదా నాయకత్వం కావాలనుకుంటాడని నేను భావించడం లేదు. అతను ఆడాలనుకుంటున్నాడు.  జట్టులో భాగమైనందుకు సంతోషిస్తున్నట్లు కనిపిస్తోంది. కోహ్లీ చాలా కాలం పాటు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతడికి ఆ కల నెరవేరింది. విరాట్‌ అధికారం కంటే జట్టుతో కలిసి ఉండటం, ఆటగాళ్లతో కలిసి ప్రయాణించడం, గ్రౌండ్‌కి వెళ్లడం, గెలిచిన క్షణాల్లో భాగం కావడాన్ని ముఖ్యంగా భావిస్తాడు. సచిన్, కోహ్లీ ఎంతో స్పెషల్. ఎందుకంటే వీరిద్దరూ టెస్టుల్లో చాలా సెంచరీలు బాదారు. కానీ, సుదీర్ఘ ఫార్మాట్లో సచిన్ సెంచరీల రికార్డు (51)ను కోహ్లీ బ్రేక్‌ చేయడం చాలా కష్టం’’ అని సంజయ్‌ మంజ్రేకర్ వివరించాడు. కోహ్లీ ఇప్పటివరకు 29 సెంచరీలు చేశాడు. సచిన్ తన వన్డే కెరీర్‌లో 49 సెంచరీలు బాదాడు. ఈ ఫార్మాట్‌లో కోహ్లీ మరో రెండు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును సమం చేస్తాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని