Virat Kohli: వైద్యం కోసం రూ.6లక్షల సాయం

టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ మరోసారి తన ఔదార్యం చాటుకున్నాడు. మహిళా క్రికెటర్‌ తల్లి చికిత్స కోసం రూ.6.77 లక్షలను....

Updated : 19 May 2021 17:25 IST

మాజీ మహిళా క్రికెటర్‌ స్రవంతి తల్లికి విరాళం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ మరోసారి తన ఔదార్యం చాటుకున్నాడు. మహిళా క్రికెటర్‌ తల్లి చికిత్స కోసం రూ.6.77 లక్షలను విరాళంగా ఇచ్చాడు. తనకు సాయం చేసినందుకు ఆ మహిళా క్రికెటర్‌, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

మాజీ మహిళా క్రికెటర్‌ స్రవంతి నాయుడు తల్లిదండ్రులకు కొవిడ్‌-19 సోకింది. అప్పటికే వారి చికిత్స కోసం రూ.16 లక్షల వరకు ఆమె ఖర్చు చేశారు. అయినప్పటికీ తల్లి ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో ఆమె బీసీసీఐ, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘాన్ని సాయం కోరింది. అదే సమయంలో బీసీసీఐ సౌత్‌ జోన్‌ మాజీ కన్వీనర్‌, స్రవంతి సోదరి ఎన్‌.విద్య.. కోహ్లీ ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ అర్థించింది. విషయం తెలుసుకున్న వెంటనే పరుగుల రారాజు దాతృత్వం చాటుకున్నాడు.

‘నిజాయతీగా చెబుతున్నా. కోహ్లీ సత్వరమే స్పందించడం అద్భుతంగా అనిపించింది. గొప్ప క్రికెటర్‌ నుంచి ఎంతో గొప్ప ఔదార్యం. టీమ్ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌కూ ధన్యవాదాలు. అతడే విషయాన్ని కోహ్లీకి చేరవేశాడు’ అని విద్య తెలిపారు.

స్రవంతి నాయుడు టీమ్‌ఇండియా తరఫున నాలుగు వన్డేలు, ఒక టెస్టు ఆడారు. మహిళల టీ20 క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు (4/9) ఆమె పేరుతోనే ఉన్నాయి. ఇక కోహ్లీ, అనుష్క దంపతులు కొవిడ్‌-19పై అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. వారే స్వయంగా రూ.2 కోట్లు ఇవ్వడమే కాకుండా రూ.11 కోట్ల వరకు విరాళాలు సేకరించారు. తన స్వచ్ఛంద సంస్థతో కలిసి విరాట్‌ పనిచేస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు