IND vs WI : అరుదైన ఘనత సాధించిన టీమిండియా.. రోహిత్‌ రికార్డును సమం చేసిన కోహ్లీ

టీమిండియా మరో అరుదైన ఘనత సాధించింది. వెస్టిండీస్‌తో శుక్రవారం (ఫిబ్రవరి 18న) జరిగిన రెండో టీ20 మ్యాచులో విజయం సాధించడం ద్వారా పొట్టి ఫార్మాట్లో 100 విజయాలు సాధించిన రెండో

Published : 19 Feb 2022 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమిండియా మరో అరుదైన ఘనత సాధించింది. వెస్టిండీస్‌తో శుక్రవారం (ఫిబ్రవరి 18న) జరిగిన రెండో టీ20 మ్యాచులో విజయం సాధించడం ద్వారా పొట్టి ఫార్మాట్లో 100 విజయాలు సాధించిన రెండో దేశంగా భారత్‌ రికార్డు నమోదు చేసింది. ఇప్పటి వరకు 155 టీ20 మ్యాచులు ఆడిన టీమిండియా వంద మ్యాచుల్లో విజయం సాధించింది. 51 మ్యాచుల్లో పరాజయం పాలైంది. మరో నాలుగు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. మరో వైపు, అగ్రస్థానంలో కొనసాగుతున్న పాకిస్థాన్‌ జట్టు 189 మ్యాచుల్లో 118 విజయాలు సాధించింది. అయితే, టీ20ల్లో గెలుపు శాతం పరంగా చూస్తే.. పాక్‌ కంటే మన జట్టే ముందుంది. భారత్‌ విజయాల శాతం 65.23 కాగా.. పాక్‌ 64.4 శాతంతో రెండో స్థానంలో ఉంది. 50 కంటే ఎక్కువ టీ20 మ్యాచులు ఆడిన జట్లతో పోల్చితే కేవలం అఫ్గానిస్థాన్‌ (67.97 శాతం) మాత్రమే మనకంటే ముందుంది.

* రోహిత్‌ సరసన కోహ్లీ..

ఈ మ్యాచులోనే మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (52) కీలక ఇన్నింగ్స్‌తో ప్రస్తుత కెప్టెన్‌ రోహిత సరసన చేరాడు. ఇప్పటి వరకు 121 టీ20 మ్యాచులు ఆడిన రోహిత్‌ శర్మ.. 30 సార్లు 50కి పైగా స్కోర్లను నమోదు చేశాడు. ఇందులో 26 అర్ధ శతకాలు, 4 శతకాలు ఉన్నాయి. మరో వైపు, కోహ్లీ 97 మ్యాచుల్లోనే.. 30 సార్లు 50కి పైగా స్కోర్లను నమోదు చేశాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం కోహ్లీ టీ20ల్లో 3,296 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్‌ (112 మ్యాచుల్లో 3299 పరుగులు) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ మరో నాలుగు పరుగులు చేస్తే గప్తిల్‌ రికార్డు బద్దలవుతుంది. కాగా, రోహిత్‌ శర్మ 121 మ్యాచుల్లో 3256 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని