Virat Kohli:ధోనీ ఇచ్చిన సలహాను ఇప్పటికీ పాటిస్తున్నా..: కోహ్లీ

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ తనకు ఓ సలహా ఇచ్చాడని, దీంతో అప్పటి నుంచి దాన్ని కచ్చితంగా పాటిస్తున్నానని ప్రస్తుత టెస్టు జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు...

Published : 11 Jan 2022 09:55 IST

కేప్‌టౌన్‌: టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ తనకు ఓ సలహా ఇచ్చాడని, దీంతో అప్పటి నుంచి దాన్ని కచ్చితంగా పాటిస్తున్నానని ప్రస్తుత టెస్టు జట్టు సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యువ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ (0) భారీ షాట్‌కు ప్రయత్నించి అనవసరంగా వికెట్‌ పారేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అతడి బ్యాటింగ్‌ తీరుపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేప్‌టౌన్‌లో జరిగే మూడో టెస్టుకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడాడు.

‘ధోనీ ఒకసారి నాకు సలహా ఇచ్చాడు. ఆటగాళ్లు చేసే పొరపాట్లు సరిదిద్దుకోవడానికి 7-8 నెలల సమయం ఇవ్వాలన్నాడు. వాళ్లు తమ తప్పులపై దృష్టిసారించినప్పుడే అది సాధ్యమవుతుందని చెప్పాడు. పంత్ విషయంలో కూడా అంతే.. ముందుకు వెళ్లేకొద్దీ తన తప్పులను సరిదిద్దుకుంటాడు. దీంతో అతడు కచ్చితంగా భవిష్యత్‌లో మంచి ప్రదర్శనలు చేస్తాడనే నమ్మకం ఉంది. ఒక ఆటగాడు తన బాధ్యత ఏంటో గుర్తించినంతకాలం.. తాను ఆడే షాట్‌ సరైందా.. లేదా? అనే విషయం అతడికి తెలుస్తుంది. మేమందరం కూడా వివిధ కారణాలతో చెత్త షాట్లు ఆడి ఔటైన సందర్భాలు ఉన్నాయి. అయితే, వాటిని అలా ఎందుకు ఆడామని గుర్తించడం కూడా ముఖ్యమైన విషయమే’ అని కోహ్లీ వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని