Virat Kohli: విరాట్ @ విండీస్‌.. విజృంభణ పక్కానా?

మెగా లీగ్‌లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన ఓ బ్యాటర్.. కీలకమైన టోర్నీలో విఫలం కావడం నిరాశతోపాటు ఆశ్చర్యానికి గురి చేసే అంశమే అవుతుంది.

Updated : 18 Jun 2024 14:06 IST

ఈసారి వరల్డ్‌ కప్‌లో టాప్‌ స్కోరర్‌ విరాట్ కోహ్లీనే.. ఇది యూఎస్‌ఏలో అడుగుపెట్టే ముందు భారత స్టార్‌ క్రికెటర్ ఫామ్‌పై ఉన్న నమ్మకంతో మాజీలు చెప్పిన మాట. కానీ, ఆ అంచనాలను ఏ స్థాయిలోనూ అందుకునేలా కనిపించలేదు. అతడి బ్యాట్ నుంచి ఒక్క సాధికారిక ఇన్నింగ్స్‌ రాలేదు. టీ20 ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌లు ఆడింది. ఒకటి రద్దైంది. కోహ్లీ నుంచి కనీసం రెండంకెల స్కోరు కూడా రాలేదంటే నమ్మశక్యం కావడం లేదు కదా.. 

ఐపీఎల్‌లో 700+ స్కోరు చేసిన విరాట్ కోహ్లీ.. ఇప్పటివరకు టీ20 ప్రపంచ కప్‌-2024లో చేసిన స్కోర్లు 1..4..0 కావడం గమనార్హం. యూఎస్‌ఏపై తొలి బంతికే పెవిలియన్‌ బాట పట్టాడు. కీలకమైన పాక్‌తో మ్యాచ్‌లోనూ ఒక్క బౌండరీ కొట్టి ఔటయ్యాడు.

ఐసీసీ టోర్నీల్లో విరాట్ కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉండేది. కానీ, ఈసారి మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దానికి కారణం అమెరికా పిచ్‌లు అని చెప్పడానికి వీల్లేదు. ఇతర బ్యాటర్లూ ఇక్కడ కాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించారు. యూఎస్‌ఏలోని ‘డ్రాప్‌ ఇన్‌’ పిచ్‌ల సమస్య ప్రతిఒక్కరికీ ఉంది. చిన్న జట్ల బ్యాటర్లు కూడా దూకుడుగానే పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. టీ20ల్లో టాప్‌ ర్యాంకర్ సూర్యకుమార్‌ యాదవ్‌ తన శైలికి భిన్నంగా నెమ్మదిగా ఆడిన సందర్భాలనూ చూశాం. కానీ, విరాట్ కోహ్లీ మాత్రం పట్టుమని పది బంతులు కూడా ఎదుర్కోకుండానే పెవిలియన్‌కు చేరడం అభిమానులను తీవ్రంగా బాధించే అంశం. వార్మప్‌ మ్యాచ్‌లోనైనా కాస్త ఆడి ఉంటే పిచ్‌ ఎలా స్పందిస్తుదనేది తెలిసేదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్న మాట.

ఓపెనర్‌గా ఐపీఎల్‌లో భారత మైదానాల్లో ఆడినట్లు దూకుడు యూఎస్‌ఏలో పని చేయలేదు. సీనియర్ అయిన అతడు ఈ విషయాన్ని ముందే గ్రహించి ఉండాల్సింది. కనీసం ఒక్క మ్యాచ్‌లో విఫలమైన తర్వాత కూడా.. తన పొరపాట్లను సరిదిద్దుకోకుండా వరుసగా తేలిపోవడం మరింత బాధించే అంశం. బంతిని పైకి లేపితే వికెట్‌ను కోల్పోయే ప్రమాదం ఉన్న యూఎస్‌ఏ పిచ్‌ల్లో.. ఎక్కువగా గ్రౌండ్‌ షాట్లు కొట్టే కోహ్లీ విఫలం కావడం కూడా మిగతా బ్యాటర్లకు గుణపాఠమే. ఇక బ్యాటింగ్‌కు సహకరించే విండీస్‌ పిచ్‌లపైనైనా కోహ్లీ మునుపటి ఫామ్‌ను అందుకుంటే భారత్‌ కప్‌ను దక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదు. అయితే, ఇక్కడా ఓ ప్రమాదం లేకపోలేదు. 

బ్యాటింగ్‌కు అనుకూలమే కానీ.. 

భారత్‌ ఆడే సూపర్-8 మ్యాచులకు విండీస్‌ వేదిక. అక్కడి పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయని విశ్లేషకుల మాట. అదే సమయంలో స్పిన్నర్లతో జర జాగ్రత్తగా ఉండాలనేది వారి సూచన. విండీస్‌ స్పిన్నర్లు వికెట్లు పడగొట్టిన సందర్భాలను చూశాం. విరాట్ కోహ్లీకి విండీస్‌లో వన్డే ఫార్మాట్‌లో మంచి రికార్డులే ఉన్నాయి. కానీ, టీ20ల్లో గొప్ప గణాంకాలు లేకపోయినా.. చెత్త ప్రదర్శన మాత్రం కాదు. ఇప్పటివరకు అక్కడ కేవలం మూడు టీ20లను మాత్రమే ఆడాడు. 141 స్ట్రైక్‌రేట్‌తో మొత్తం 112 పరుగులు సాధించాడు. ఇక్కడ బ్యాటర్లకు ఎంత మద్దతు దొరుకుతుందో.. స్పిన్నర్లకు సహకారం కూడా అదే స్థాయిలో ఉంటుంది. విరాట్ లక్ష్యంగా ప్రత్యర్థి జట్లు స్పిన్‌ ఎటాక్‌ను ముమ్మరం చేసే అవకాశం లేకపోలేదు. అఫ్గాన్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ జట్లలో టాప్‌ క్లాస్‌ స్పిన్నర్లు ఉన్నారు. వారిని ఎదుర్కొనేటప్పుడు కాస్త ఓర్పు ప్రదర్శిస్తే కోహ్లీదే ఆధిపత్యం అవుతుంది. 

వారి నమ్మకాన్ని నిలబెడతాడా?

‘‘కోహ్లీ ఫామ్‌పై అనుమానం అక్కర్లేదు. అతడు కాస్త సహనంగా క్రీజ్‌లో ఉంటే చాలు. ప్రత్యర్థి బౌలర్లే గతి తప్పుతారు. అలవోకగా పరుగులు రాబట్టే ఆస్కారం ఉంది’’ అని గావస్కర్‌ సూచన. అదీ నిజమే కదా... కోహ్లీపై ఇప్పుడేమీ ఒత్తిడి లేదు. ఓపెనర్‌గా ఇబ్బంది పడతాడా? అంటే ఐపీఎల్‌లోనూ ఇదే స్థానంలో ఆడి టాపర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించి పీక్‌ స్టేజ్‌కు తీసుకెళ్లగల సత్తా విరాట్ సొంతం. సూపర్-8 పోరులోనైనా కోహ్లీ బ్యాట్‌ను ఝళిపించాలని అభిమానుల కోరిక.

-ఇంటర్నెట్ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని