Virat Kohli: మూడేళ్లపాటు సెంచరీ చేయకపోవడం బాధించింది.. రికార్డుల కోసం ఆడను: కోహ్లీ

టెస్టుల్లో మూడేళ్లపాటు సెంచరీ చేయకపోవడం తనను బాధించిందని టీమ్‌ఇండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అన్నాడు.

Updated : 14 Mar 2023 19:07 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ  (Virat Kohli) టెస్టుల్లో సెంచరీ కరవు తీర్చుకున్నాడు. దాదాపు 1200 రోజుల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌లో మూడంకెల స్కోరును అందుకున్నాడు. అతడు ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారీ శతకం (186) బాదాడు. ఈ టెస్టు డ్రాగా ముగియడంతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీతో భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) చిట్‌ చాట్‌ చేశాడు. ఈ సందర్భంగా ‘మూడేళ్లపాటు టెస్టుల్లో సెంచరీ చేయకపోవడం కష్టంగా అనిపించిందా’ అని ద్రవిడ్‌.. కోహ్లీని ప్రశ్నించాడు. 

దానికి కోహ్లీ.. ‘నిజం చెప్పాలంటే.. నా సొంత తప్పిదాలే నేను   చాలాకాలంపాటు సెంచరీకి దూరంగా ఉండేలా చేశాయి.  మూడంకెల మార్క్‌ని పొందాలనే తపన ఒక బ్యాటర్‌గా మీలో కూడా ఉంటుందనుకుంటున్నా. మనమందరం ఏదో ఒక దశలో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం. అది నా విషయంలో కాస్త ఎక్కువ కాలంపాటు కొనసాగిందని భావిస్తున్నా. నేను 40 లేదా 45 పరుగులతో సంతోషంగా ఉండే ఆటగాడిని కాదు. ఈ మ్యాచ్‌లో నేను 40 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ 150 పరుగులు చేయగలనని, ఆ రన్స్‌ నా జట్టుకు ఉపయోగపడతాయని తెలుసు. క్లిష్ట పరిస్థితుల్లో జట్టు కోసం మంచి ప్రదర్శన చేసినపప్పుడల్లా గర్వపడతాను’ అని చెప్పాడు.

‘మూడేళ్లపాటు టెస్టుల్లో శతకం చేయకపోవడం నన్ను బాధించింది. అయితే, రికార్డులు, మైలురాళ్ల కోసం నేను ఎప్పుడూ ఆడను. అసలు వాటి గురించి పట్టించుకోను. కానీ, అందరూ సెంచరీ గురించే మాట్లాడుతున్నారు. నేను వారందరికీ ఎల్లప్పుడూ చెప్పేది ఒక్కటే.. జట్టు కోసం వీలైనంత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం, ఎక్కువ పరుగులు చేయడం నా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే సెంచరీ రావాలనుకుంటా. హోటల్ బాయ్ నుంచి బస్ డ్రైవర్, లిఫ్ట్‌లో ఉన్న వ్యక్తి వరకు ప్రతీ ఒక్కరూ మాకు సెంచరీ కావాలని అడిగారు. ఇది నాకు కాస్త ఇబ్బంది కలిగించింది’ అని సమాధానమిచ్చాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని