Virat Kohli: స్పిన్‌ ఎదుర్కోవడం కోహ్లీకి కాస్త కష్టమే.. కింగ్‌కు మాజీ ఆటగాడి సూచన ఇదే..!

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ స్ట్రైక్‌ రేట్‌ స్పిన్‌ బౌలింగ్‌లో కాస్త తగ్గించదని మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ అభిప్రాయపడ్డాడు. రాబోయే టెస్టు సిరీస్‌ కోసం కింగ్‌కు అతడు ఓ సలహా ఇచ్చాడు.

Published : 03 Feb 2023 11:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరికొద్ది రోజుల్లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ (Border-Gavaskar Trophy) జరగనుంది. ఈ సిరీస్‌ కోసం ఇప్పటికే నాగ్‌పుర్‌ చేరుకున్న టీమ్‌ఇండియా (Team India) జట్టు తొలి టెస్టు కోసం సాధన మొదలుపెట్టింది. ఈ సిరీస్‌లో క్రికెట్‌ అభిమానుల కళ్లన్నీ విరాట్‌ కోహ్లీ (Virat Kohli)పైనే. పరిమిత ఓవర్లలో తిరిగి ఫామ్‌లోకి వచ్చి రికార్డులు సృష్టిస్తున్న ఈ పరుగుల రారాజు.. టెస్టుల్లోనూ సత్తా చాటాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఈ సందర్భంగా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్ (Irfan Pathan)‌.. ఈ ట్రోఫీ గురించి స్పందిస్తూ టెస్టుల్లో విరాట్‌ ఆటతీరును విశ్లేషించాడు. అతడికి ఓ సలహా కూడా ఇచ్చాడు.

‘‘ఈ సిరీస్‌లో అతడు (కోహ్లీ) నాథన్‌ లయన్‌, ఆష్టన్‌ అగర్‌ స్పిన్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై దృష్టిపెట్టాలి. ఎందుకంటే స్పిన్‌ బౌలింగ్‌లో అతడు కొంచెం ఇబ్బందిపడుతున్నట్లు కన్పిస్తోంది. ఈ బౌలింగ్‌ ఎదుర్కోవడంలో అతడి స్ట్రైక్‌ రేటు కాస్త తగ్గింది. అందుకే అతడు మరింత దూకుడుగా ఆడితే బాగుంటుంది. ఇది టెస్టు క్రికెట్ అని తెలుసు. కానీ, కొన్నిసార్లు అతడు స్పిన్‌ను దూకుడుగా ఎదుర్కోక తప్పదని అనుకుంటున్నా. ముఖ్యంగా నాథన్ లయన్‌ లాంటి బౌలర్‌ ఉన్నప్పుడు.. కోహ్లీ ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి’’ అని ఇర్పాన్‌ పఠాన్‌ సూచించాడు.

ఆస్ట్రేలియా (Australia)పై ఇప్పటి వరకు 20 టెస్టు మ్యాచ్‌లు ఆడిన విరాట్ (Virat Kohli) 1682 పరుగులు చేశాడు. సగటు 48.05గా ఉంది. ఆసీస్‌పై ఏడు సెంచరీలు కూడా నమోదు చేశాడు.

ఫిబ్రవరి 9 నుంచి భారత్‌, ఆసీస్‌ మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ (బోర్డర్‌-గావస్కర్ ట్రోఫీ) ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9-13 మధ్య నాగ్‌పుర్‌ వేదికగా తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టుకు దిల్లీ, మూడో టెస్టుకు ధర్మశాల, నాలుగో టెస్టుకు అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని