
Kohli - Ashwin : కోహ్లీ వారసత్వాన్ని కొనసాగించడం మామూలు విషయం కాదు :అశ్విన్
ఇంటర్నెట్ డెస్క్ : విరాట్ కోహ్లీ టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పాడని ప్రశంసించాడు. అయితే, అతడి వారసత్వాన్ని కొనసాగించడం మామూలు విషయం కాదని పేర్కొన్నాడు.
‘క్రికెట్లో కెప్టెన్ల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. వారు నెలకొల్పిన రికార్డులు, సాధించిన ఘన విజయాల గురించే మాట్లాడుతుంటారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంకల్లో నువ్వు గొప్ప విజయాలు సాధించావు. భారత క్రికెట్లో కెప్టెన్‌గా నువ్వు నెలకొల్పిన బెంచ్‌మార్క్‌లను కొనసాగించడం ఏ నాయకుడికైనా కష్టమే. విజయాలు అనేవి పంటకు ముందు మనం నాటిన విత్తనాల ఫలితమే. టీమ్ఇండియా విజయాల కోసం నువ్వు నాణ్యమైన విత్తనాలను నాటావు. నీ స్థానాన్ని భర్తీ చేయగల నాయకుడిని వెతికిపెట్టే గొప్ప తలనొప్పిని మా ముందుంచావు. అభినందనలు కోహ్లీ.. నువ్వు అందించిన ఘన వారసత్వం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను’ అని రవిచంద్రన్ అశ్విన్ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో 55 టెస్టులు ఆడిన అశ్విన్ 293 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ సత్తా చాటి మూడు శతకాలు నమోదు చేశాడు.
* యువ క్రికెటర్లకు కోహ్లీ ఆదర్శం : మహమ్మద్ ఆమీర్
టీమ్ఇండియా టెస్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తప్పుకోవడంపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమీర్ స్పందించాడు. ‘భవిష్యత్తు తరాలకు నిజమైన నాయకుడు విరాట్ కోహ్లీ. యువ ఆటగాళ్లకు నువ్వు ఆదర్శం. మైదానంలో నీ దూకుడు కొనసాగాలి’ అని ఆమీర్ ట్వీట్ చేశాడు.