Sourav Ganguly : కోహ్లీ.. టెస్టుల్లోనూ దూకుడుగా ఆడు : గంగూలీ

టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli).. ఇటీవల సెంచరీలతో చెలరేగుతున్నాడు. దీంతో టెస్టుల్లోనూ అతడు ఇలాంటి మంచి ప్రదర్శనే చేయాలని గంగూలీ(Sourav Ganguly) కోరాడు.

Published : 27 Jan 2023 14:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  పరుగుల వీరుడు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) మునుపటి ఫామ్‌ను అందుకుని ఇటీవల బంగ్లాదేశ్‌, శ్రీలంకపై సెంచరీలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. టెస్టుల్లోనూ కింగ్‌ ఇదే దూకుడును ప్రదర్శించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. త్వరలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ(Sourav Ganguly) కూడా ఇదే విషయంపై స్పందించాడు.

కోహ్లీపై ఉన్న అంచనాల గురించి ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడాడు . విరాట్‌పైనే భారత క్రికెట్‌ జట్టు (Team India) ఆధారపడి ఉందని.. అందుకే టెస్టుల్లోనూ అతడు దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ‘కోహ్లీ బాగా ఆడుతున్నాడు. బంగ్లాదేశ్‌, శ్రీలంకపై అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్టు క్రికెట్‌లోనూ అతడు రాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత క్రికెట్‌ జట్టు అతడిపై ఆధారపడి ఉంది. త్వరలో ఆస్ట్రేలియాతో సిరీస్‌ జరగనుంది. రాణించడానికి అతడికిది మంచి తరుణమని భావిస్తున్నా. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్‌, ఆస్ట్రేలియా తలపడితే చూడాలని ఉంది’ అని దాదా అన్నాడు.

ఇక వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా అవకాశాలపై గంగూలీ మాట్లాడుతూ.. జట్టుపై తనకు ఎంతో నమ్మకముందని తెలిపాడు. ‘భారత్‌ ఎంతో బలమైన టీం. మన దేశంలో ఎంతో మంది క్రికెట్‌ ఆడుతున్నారు. కానీ, పోటీ తీవ్రంగా ఉండటం వల్ల.. సగం మంది ఆటగాళ్లకు జాతీయ జట్టులో అవకాశం రావడం లేదు. ప్రపంచకప్‌ వరకూ ఈ టీమే కొనసాగాలని కోరుకుంటున్నా. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, సెలెక్టర్లు ఇదే టీమ్‌ను మెగా టోర్నీ వరకు కొనసాగించాలి. ఇక ప్రపంచకప్‌లో పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆటపైనే దృష్టి పెట్టి ఉత్తమ ప్రదర్శన ఇస్తే సరిపోతుంది’ అని గంగూలీ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని