
కోహ్లీ ఆధునిక రిచర్డ్స్: అది కిషన్ అదృష్టం
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఆధునిక క్రికెట్లో వివ్ రిచర్డ్స్ అని పాక్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ప్రశంసించాడు. అతడితో కలిసి భాగస్వామ్యం నెలకొల్పడం ఇషాన్ కిషన్ అదృష్టమని తెలిపాడు. యువ క్రికెటర్లో విరాట్ ఆత్మవిశ్వాసం నింపాడని పేర్కొన్నాడు. మున్ముందు అతడి నుంచి విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నట్టు సందేశమిచ్చాడని వివరించాడు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీసులో కిషన్ దూకుడును ఆయన మెచ్చుకున్నారు.
‘ఇషాన్ కిషన్‌లో గొప్ప ప్రతిభ, సామర్థ్యం ఉన్నాయి. అతడు విధ్వంసకరంగా బంతిని బాదగలడు. కాస్త పొట్టిగా ఉన్నా ఆఫ్‌సైడ్, లెగ్లైడ్ బంతిని చక్కని టైమింగ్‌తో ఆడతాడు. సిక్సర్లు బాదేస్తాడు. తనదైన రోజున అతడు మ్యాచులను మలుపు తిప్పగలడు. అరంగేట్రంలోనే అర్ధశతకంతో మురిపించాడు’ అని రమీజ్ రాజా అన్నాడు.
‘కిషన్ స్వేచ్ఛగా ఆడాడు. చక్కని పరిస్థితుల్లో అతడు మైదానంలోకి వచ్చాడు. ఆడిన ప్రతి షాట్‌కు నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో కోహ్లీ అండ లభించింది. బ్యాటింగ్ దిశను మారుస్తున్నామని సిక్సర్లు, బౌండరీలు కొట్టాలని అతడు సూచించాడు. ఈ ప్రక్రియలో ఔటైనా ఇబ్బంది లేదని భరోసా ఇచ్చాడు. కోహ్లీతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పడం కిషన్ అదృష్టం. ఎందుకంటే నా దృష్టిలో విరాట్ ఆధునిక వివ్ రిచర్డ్స్’ అని రమీజ్ రాజా తన యూట్యూబ్ చానల్లో తెలిపాడు.