Shubman Gill: శుభ్‌మన్‌ గిల్ టీమ్‌ఇండియా భవిష్యత్తు: విరాట్‌ కోహ్లీ

కివీస్‌తో జరిగిన మూడో టీ20లో యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ తన కెరీర్‌లో తొలి టీ20 శతకాన్ని బాదిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Published : 02 Feb 2023 16:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ శతకం బాదిన విషయం తెలిసిందే. దీంతో అతడు తన కెరీర్లో తొలి టీ20 శతకాన్ని నమోదు చేశాడు. ఈ సందర్భంగా పలువురు ఆటగాళ్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అతడిని టీమ్‌ఇండియా భవిష్యత్తుగా పేర్కొన్నాడు. భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌ అతడిని విరాట్‌తో పోల్చాడు. 

కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పెషల్‌ పోస్టు పెట్టాడు. ‘‘శుభ్‌మన్‌ గిల్‌ స్టార్‌. అతడు టీమ్‌ఇండియా భవిష్యత్తు’’ అని పేర్కొన్నాడు. ఇర్ఫాన్‌ ‘‘అతడి బ్యాటింగ్‌కు నేను వీరాభిమానిని. విరాట్ చాలా సంవత్సరాలు అన్ని ఫార్మాట్లను ఏలాడు. గిల్‌ కూడా అదే కొనసాగిస్తాడు. అన్ని ఫార్మాట్లకూ అతడు కీలకమైన ఆటగాడిగా మారతాడు’’ అని తెలిపాడు. ‘‘ఇన్నింగ్స్‌ తొలి భాగంలో జాగ్రత్తగా ఆడిన గిల్‌ తర్వాత దూకుడు ప్రదర్శించాడు. అతడు ఫ్యాన్సీ స్ట్రోక్స్‌ను నమ్మే వ్యక్తి కాదు. అతడు మొత్తం మైదానాన్ని లక్ష్యంగా చేసుకుని క్రికెటింగ్‌ షాట్లు ఆడాడు. అతడి ఆట అద్బుతంగా ఉంది. రానున్న కాలంలో అతడి నుంచి గొప్ప ప్రదర్శనలు చూడొచ్చు’’ అని భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ అన్నాడు. ఇక మ్యాచ్‌ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ మాట్లాడుతూ గిల్‌ అద్భుతంగా ఆడాడని, అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడన్నాడు.

భారత్‌ - న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మూడో టీ20లో శుభ్‌మన్‌గిల్‌ శతకంతో అదరగొట్టి జట్టుకు భారీ స్కోరును అందించాడు. బ్యాటర్లు, బౌలర్లు గొప్పగా రాణించడంతో కివీస్‌ను భారత్‌ చిత్తుచేసి మరీ సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో సెంచరీ, కివీస్‌తో ద్విశతకం సాధించాడు గిల్‌. ఇక టీ20లో నమోదైన తాజా శతకంతో అతడు అన్ని ఫార్మాట్లలో సెంచరీ బాదిన ఐదో బ్యాటర్‌గా సురేశ్‌ రైనా, రోహిత్ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీలతో సమంగా నిలిచాడు. అంతేకాక భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా ఉన్న విరాట్‌ కోహ్లీ(122)ని శుభ్‌మన్‌ గిల్‌(126) వెనక్కినెట్టాడు. బుధవారం మ్యాచ్‌ అనంతరం గిల్‌ మాట్లాడుతూ..‘‘మన ప్రయత్నానికి తగిన ఫలితం లభించినప్పుడు గొప్పగా అనిపిస్తుంది. జట్టు భారీ విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. క్రికెటర్‌గా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అలసట అనేదే ఉండదు. మూడు ఫార్మాట్లు ఆడటానికి నేనెప్పుడూ సిద్ధమే’’ అని గిల్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని