Virat-Bumrah: బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్‌పై సంతకం చేస్తానన్న కోహ్లీ

టీ20 ప్రపంచ కప్‌తో ముంబయికి చేరిన క్రికెట్‌ ఛాంపియన్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్‌ మాతాకీ జై.. జయహో భారత్‌.. వందేమాతరం లాంటి నినాదాలతో అభిమానులు హోరెత్తించారు.

Published : 05 Jul 2024 10:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) టీమ్‌ఇండియా సొంతం చేసుకోవడంలో జస్‌ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించిన అతడు అత్యుత్తమ ఎకానమీతో బంతులేశాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో వికెట్లు తీసి జట్టును గెలిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అందుకే, అతడిని జాతి సంపదగా గుర్తించాలని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అన్నాడు. పొట్టి కప్‌ను నెగ్గిన తర్వాత స్వదేశానికి చేరుకున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబయిలో భారీ రోడ్‌షో జరిగింది. వాంఖడే మైదానంలో క్రికెటర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బుమ్రా గురించి కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఫైనల్‌ సందర్భంగా నేను కూడా ఒక దశలో మరోసారి కప్‌ చేజారిపోతుందా? అనుకున్నా. అయితే, చివరి ఐదు ఓవర్లలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వేసిన ఆ రెండు ఓవర్లు అద్భుతం. ఎంతో ప్రత్యేకం. ప్రతిసారి మ్యాచ్‌లో మనల్ని విజయం వైపు నడిపించిన బుమ్రాపై వెల్లువెత్తిన ప్రశంసలు ఆనందం కలిగించాయి. ఎంతకాలం భారత జట్టు తరఫున ఆడాలని అతడు అనుకుంటాడో.. అప్పటి వరకు ప్రాతినిధ్యం వహించాలి. అంతేకాకుండా బుమ్రాను ఎనిమిదో వింతగా ప్రకటించాలనే పిటిషన్‌పై నేను సంతకం చేస్తా. తరానికి ఒక్కరు మాత్రమే ఇలాంటి బౌలర్‌ ఉంటాడు’’ అని విరాట్‌ తెలిపాడు.

ఫ్యాన్స్‌కు అంకితం: రోహిత్

నాయకుడిగా దేశానికి కప్‌ అందించిన తన కుమారుడిని రోహిత్ శర్మ (Rohit Sharma) తల్లి పూర్ణిమ ఆప్యాయంగా ముద్దాడారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకున్నాయి. టీ20 వరల్డ్‌ కప్‌తో కలిసి ముంబయిలో రోడ్‌షోలో పాల్గొన్న అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ‘‘దేశం కోసం ఈ ట్రోఫీ సాధించాం. దాదాపు 11 ఏళ్ల నుంచి వరల్డ్‌ కప్‌ కోసం వేచి చూస్తున్న అభిమానులకు దీనిని అంకితం చేస్తున్నాం. పొట్టి కప్‌తో స్వదేశానికి చేరుకున్నాక అపూర్వ స్వాగతం లభించింది. ఇక ముంబయిలోనూ ఏమాత్రం నిరుత్సాహపరచలేదు. భారీగా అభిమానులు తరలిరావడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నాం’’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు