Virat Kohli: మీరు దేవుడిచ్చిన గిఫ్ట్‌.. నాకు గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌: రొనాల్డోపై కోహ్లీ భావోద్వేగ పోస్టు

ఫుట్‌బాల్‌ దిగ్గజం రొనాల్డో(Cristiano Ronaldo) ఆటతీరును మెచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సందేశాలు పెడుతున్నారు. ఈ స్టార్‌ ఆటగాడికి పెద్ద అభిమాని అయిన క్రికెట్‌ దిగ్గజం కింగ్‌ కోహ్లీ(Virat Kohli) కూడా.. మనసును హత్తుకునే పోస్టు చేశాడు

Updated : 13 Dec 2022 09:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఫుట్‌బాల్‌ దిగ్గజం, ఆల్‌టైమ్‌ గ్రేట్‌ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) గురించే ఇప్పుడు చర్చంతా. ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీ(fifa world cup 2022) నుంచి పోర్చుగల్‌ నిష్క్రమించడంతో..  అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ నుంచి ఈ సాకర్‌ సూపర్‌ స్టార్‌ రిటైర్మెంట్‌ తీసుకునే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొరాకోతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో 1-0 తేడాతో ఓడి పోర్చుగల్‌(Portugal) ఇంటికి పయనమైన విషయం తెలిసిందే. దీంతో కెరీర్‌లో కనీసం ఒక్క ప్రపంచకప్‌ అయినా సాధించాలన్న రొనాల్డో(Cristiano Ronaldo) కల చెదిరింది. 37 ఏళ్ల రొనాల్డో మరో ప్రపంచకప్‌ ఆడే అవకాశాలు దాదాపు లేనట్లే. ఈ నేపథ్యంలో అతడి ఆటతీరును మెచ్చుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక ఈ స్టార్‌ ఆటగాడికి పెద్ద అభిమాని అయిన టీమిండియా క్రికెట్‌ దిగ్గజం కింగ్‌ కోహ్లీ(Virat Kohli) కూడా.. రొనాల్డోను ప్రశంసిస్తూ మనసుకు హత్తుకునే సందేశాన్ని పోస్టు చేశాడు.

‘ఈ ఆటలో మీరు సాధించిన ఘనతను, అభిమానులకు అందించిన స్ఫూర్తిని ఏ ట్రోఫీగానీ లేదా టైటిల్‌గానీ దూరం చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులపై మీరు చూపిన ప్రభావాన్ని.. మీ ఆటను చూసినప్పుడు మాకు కలిగే అనుభూతిని ఏ టైటిలూ వర్ణించలేదు. అది దేవుడిచ్చిన బహుమతి. ఆటలో ప్రతి క్షణం మనసుపెట్టి ఆడటం.. కఠోర శ్రమ, అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనం.. ప్రతి క్రీడాకారుడికి నిజమైన ఆదర్శం.. ఇవన్నీ ఆ దేవుడు మీకందించిన ఆశీర్వాదాలు. అందుకే, మీరు నాకు గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ అని రొనాల్డో గొప్పతనాన్ని కోహ్లీ కొనియాడాడు. 

ఈ ప్రపంచకప్‌ నుంచి పోర్చుగల్‌ నిష్క్రమించిన తర్వాత ‘నా కల ఇక ముగిసింది’ అని బాధతప్త హృదయంతో రొనాల్డో అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓటమి ఖాయం కాగానే.. ఒక్కసారిగా భావోద్వేగానికి లోనైన రొనాల్డో (Cristiano Ronaldo) మైదానంలో చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చాడు. అతడు కన్నీళ్లను తుడుచుకొంటూ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్తున్న చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఫుట్‌బాల్‌ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా పేరున్న రొనాల్డో కెరీర్‌లో.. వరల్డ్‌కప్‌ ఓ లోటుగానే మిగిలి ఉంటుంది. పోర్చుగల్‌ (Portugal) తరఫున 195 మ్యాచ్‌లు ఆడిన క్రిస్టియానో రొనాల్డో 118 గోల్స్‌ చేశాడు. ఇక పోర్చుగల్‌కి తిరిగి ఆడేది లేనిది అతడు ఇంకా ధ్రువీకరించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని