‘సూపర్‌’ సైని

ముంబయిపై సూపర్‌ఓవర్‌ను యువపేసర్‌ నవదీప్‌ సైని అద్భుతంగా విసిరాడని బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ ప్రశంసించాడు. అత్యంత ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అతడు బంతులు వేశాడని పేర్కొన్నాడు. మైదానం పెద్దది కావడంతో రిస్క్‌ చేశాడని వివరించాడు...

Published : 29 Sep 2020 10:38 IST

ప్రశంసించిన కోహ్లీ

(Twitter/Navdeep saini)

దుబాయ్‌: ముంబయిపై సూపర్‌ఓవర్‌ను యువపేసర్‌ నవదీప్‌ సైని అద్భుతంగా విసిరాడని బెంగళూరు సారథి విరాట్‌ కోహ్లీ ప్రశంసించాడు. అత్యంత ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అతడు బంతులు వేశాడని పేర్కొన్నాడు. మైదానం పెద్దది కావడంతో రిస్క్‌ చేశాడని వివరించాడు.

దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ పోరులో మొదట బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఛేదనలో 39 పరుగులకే ముంబయి కీలకమైన మూడు వికెట్లు చేజార్చుకొని ఇబ్బందుల్లో పడింది. అయితే ఇషాన్‌ కిషన్‌ (99; 58 బంతుల్లో 2×4, 9×6), పొలార్డ్‌ (60*; 24 బంతుల్లో 3×4, 5×6) ఆఖరి వరకు పోరాడి స్కోరును సమం చేశారు.

ఇక సూపర్‌ఓవర్లో ముంబయిని సైని 7 పరుగులకే పరిమితం చేశాడు. తొలి రెండు బంతుల్లో రెండు సింగిల్స్‌ ఇచ్చాడు. మూడో బంతికి పరుగులేమీ రాలేదు. నాలుగో బంతిని పొలార్డ్‌ బౌండరీకి తరలించాడు. ఐదో బంతికి అతడు ఔటవ్వగా ఆరో బంతికి బైస్‌ రూపంలో ఒక పరుగే వచ్చింది. ఆ తర్వాత బెంగళూరు ఆఖరి బంతికి మ్యాచులో విజయం సాధించింది.

‘సైని నుంచి అద్భుతమైన సూపర్‌ ఓవర్‌. హార్దిక్‌, పొలార్డ్‌కు బంతులు వేయడమంటే సాధారణ విషయం కాదు. పెద్ద బౌండరీలు కావడంతో యార్కర్లు వేసేందుకు ఆత్మవిశ్వాసం పెంచుకున్నాను. ఎందుకంటే అతడికి వేగం ఉంది. అంతేకాకుండా వైడ్‌ యార్కర్లు చక్కగా వేశాడు’ అని కోహ్లీ ప్రశంసించాడు.

‘కీలకమైన రెండు పాయింట్లు సంపాదించుకొనేందుకు కుర్రాళ్లు ఎంతో కష్టపడ్డారు. మ్యాచులో విజయం దోబూచులాడింది. ఫీల్డింగ్‌పై మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. క్యాచులు సరిగ్గా అందుకొని ఉంటే విజయం ముందుగానే వరించేది. ఏబీ అద్భుతంగా ఆడాడు. వాషింగ్టన్‌ సుందర్‌తో పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయించడం ఫలితాలని ఇచ్చింది’ అని విరాట్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని