Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్‌గా డుప్లెసిస్‌.. కోహ్లీ స్పందన చూడండి!

రాబోయే ఐపీఎల్‌ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నూతన సారధిగా ఎంపిక చేయడంపై మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు...

Updated : 14 Mar 2022 20:21 IST

బెంగళూరు: రాబోయే ఐపీఎల్‌ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నూతన సారథిగా ఎంపిక చేయడంపై మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. శనివారం ఆ జట్టు యాజమాన్యం డుప్లెసిస్‌ పేరును ఖరారు చేయగానే విరాట్‌ స్పందించాడు. అతడు మాట్లాడిన వీడియోను ఆర్సీబీ ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది.

‘త్వరలోనే ఐపీఎల్‌-15వ సీజన్‌ ప్రారంభమవుతున్న సంగతి మీకు తెలిసిందే. ఇక నేను చెప్పదల్చుకున్న ముఖ్యమైన విషయం.. డుప్లెసిస్‌ ఆర్సీబీ సారథిగా ఎంపికయ్యాడు. ఎంతో కాలంగా అతడు నాకు మంచి స్నేహితుడు. అతడికి ఆర్సీబీ బాధ్యతలను అప్పగించడం ఆనందంగా ఉంది. డుప్లెసిస్‌ కేవలం క్రికెట్‌లోనే కాకుండా నాకు వ్యక్తిగతంగానూ బాగా తెలిసిన వ్యక్తి. డుప్లెసిస్‌.. మాక్స్‌వెల్‌తో కలిసి ఆడటం ఆర్సీబీ అభిమానులకు పండగలా ఉంటుంది. మరోవైపు ఈసారి మేం తీసుకున్న కొత్త, పాత ఆటగాళ్లతో జట్టు నూతన ఉత్తేజంతో ఉంది. చూస్తుంటే చాలా బలంగా, సమతూకమైన జట్టులా కనిపిస్తోంది. దీంతో ఈ సీజన్‌ కోసం నేనెంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’  అని కోహ్లీ పేర్కొన్నాడు.

కాగా, 2013లో ఆర్సీబీ కెప్టెన్‌గా ఎంపికైన విరాట్‌ గతేడాది వరకూ జట్టును ముందుండి నడిపించాడు. గత సీజన్‌ పూర్తవ్వగానే ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు.  అయితే.. ఎన్నో అంచనాలతో ప్రతి సంవత్సరం బరిలోకి దిగే ఈ జట్టు.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్‌ నెగ్గలేదు. ఈ నేపథ్యంలో కొత్త సారథి.. ఆర్సీబీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని