2011 final: నా కెరీర్‌లో ఆ 35 పరుగులు అత్యంత విలువైనవి: విరాట్‌ కోహ్లీ

2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో తాను సాధించిన 35 పరుగులు క్రికెట్‌ కెరీర్‌లో అత్యంత విలువైన పరుగులని టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు...

Updated : 07 Dec 2022 22:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో తాను సాధించిన 35 పరుగులు క్రికెట్‌ కెరీర్‌లో అత్యంత విలువైన పరుగులని టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. టీమ్‌ఇండియా నాడు రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడి శనివారం నాటికి 11 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో కోహ్లీ తాజాగా నాటి విశేషాలను బెంగళూరు ఫ్రాంఛైజీతో పంచుకున్నాడు. అప్పుడు సచిన్‌ (18) ఔటయ్యాక తాను క్రీజులోకి వెళుతుంటే ఒక మాట చెప్పాడని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు.

‘ఆరోజు టీమ్ఇండియా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచినప్పుడు బరిలోకి దిగి బ్యాటింగ్‌ చేయాల్సిన ఒత్తిడి నాకింకా గుర్తుంది. సెహ్వాగ్‌, సచిన్‌ ఔటయ్యారు. అప్పుడు నేను క్రీజులోకి వెళుతుంటే సచిన్‌ నాతో మాట్లాడాడు. గంభీర్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని చెప్పాడు. నేనూ అలాగే చేశాను. మేం ఇద్దరం మూడో వికెట్‌కు 83 పరుగుల విలువైన భాగస్వామ్యం జోడించాం. ఆరోజు నేను సాధించిన 35 పరుగులు.. నా కెరీర్‌లో అత్యంత విలువైనవి. ఎందుకంటే అత్యంత కీలకమైన మ్యాచ్‌లో కష్టాల్లో ఉన్నప్పుడు గంభీర్‌తో కలిసి జట్టును గాడిలో పెట్టాను. అందుకెంతో సంతోషించా. ఆ రోజు ప్రపంచకప్‌ గెలిచిన క్షణాలు ఎంతో అద్భుతం. ఎప్పటికీ మర్చిపోలేను’ అని కోహ్లీ నాటి విశేషాల్ని పంచుకున్నాడు.

అనంతరం సచిన్‌ గురించి మాట్లాడిన విరాట్‌.. ‘తెందూల్కర్‌ 21 ఏళ్ల పాటు భారత క్రికెట్‌ను తన భుజాలపై మోశాడు. మేం విజయం సాధించాక అతడిని మా భుజాలపై మోయాలనుకున్నాం. అందుకు అదే సరైన సమయమని భావించాం. సచిన్‌ గొప్పతనాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. టీమ్‌ఇండియా తరఫున సచిన్‌ సాధించిన రికార్డులు చాలా గొప్పవి’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని