Virat-Yuvi: ఇప్పుడు మనం తండ్రులం.. మధురమైన జ్ఞాపకాలను కోరుకుందాం..

తనను దిగ్గజ సారథిగా అభివర్ణిస్తూ టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు...

Published : 24 Feb 2022 01:53 IST

యువరాజ్‌ సింగ్‌ లేఖకు స్పందించిన విరాట్ కోహ్లీ

ఇంటర్నెట్ డెస్క్‌: తనను దిగ్గజ సారథిగా అభివర్ణిస్తూ టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ రాసిన లేఖకు విరాట్ కోహ్లీ స్పందించాడు. యువీ కోసం ఇన్‌స్టా వేదికగా విరాట్ భావోద్వేగ సందేశం పోస్ట్ చేశాడు. ఎల్లప్పుడూ మాకు స్ఫూర్తిగా నిలుస్తావని కోహ్లీ పేర్కొన్నాడు. ‘‘ యువీ.. నీ అద్భుతమైన భావవ్యక్తీకరణకు ధన్యవాదాలు. నా కెరీర్ మొదటి రోజు నుంచి మంచి అనుబంధం ఉన్న వ్యక్తి నుంచి వచ్చిన బహుమతి(గోల్డెన్‌ బూట్‌). దీనికి చాలా అర్థం ఉంది. క్యాన్సర్ బారిన పడి కోలుకుని మళ్లీ క్రికెట్‌ పునరాగమనం చేసిన తీరు అన్ని రంగాలలోని వారికి స్ఫూర్తిదాయకం. అదేవిధంగా మీ చుట్టూ ఉండే సన్నిహితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎల్లప్పుడూ ఉదారంగా ఉంటారని నాకు తెలుసు. ఇప్పుడు మనిద్దరం తండ్రులుగా ఉన్నాం. ఆనందం, మధురమైన జ్ఞాపకాలు పొందుపరుచుకోవాలని కోరుకుంటున్నా’’ అని యువీతో ఉన్న ఫొటోను, గోల్డెన్‌ బూట్‌ ఇమేజ్‌ను కోహ్లీ షేర్‌ చేశాడు. విరాట్-అనుష్క జంటకు గతేడాది వామిక జన్మించగా.. యువరాజ్‌-హేజల్‌ కీచ్‌ జోడీకి ఇటీవలే మగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే.

దేశం గర్వించేలా చేయ్‌.. 

విరాట్‌ కోహ్లీకి టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఓ భావోద్వేగ లేఖను నిన్న రాసిన విషయం తెలిసిందే. ఆటగాడిగా, వ్యక్తిగా కోహ్లీ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. తన పట్టుదల, కఠోర శ్రమ కారణంగా కోహ్లీ  ప్రపంచవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలిచాడని అన్నాడు. అతడి నుంచి మరిన్ని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ‘‘నువ్వు నీలానే ఉంటావని, నీలానే ఆడతావని, ఇలాగే దేశం గర్వపడేలా చేస్తూనే ఉంటావని ఆశిస్తున్నా’’ అని అంటూ కోహ్లీ కోసం తాను రాసిన లేఖను, దాంతోపాటు గోల్డెన్‌ బూట్‌ను ట్విటర్‌లో యువీ ఉంచాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని