Virat Kohli: నేను కూడా జంక్‌ఫుడ్‌ తిన్నా.. కానీ: విరాట్‌ కోహ్లీ

కఠినమైన డైట్‌తో ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యమిచ్చే టీమ్‌ఇండియా (Team India) స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తాను కూడా జంక్‌ఫుడ్‌ను బాగా ఎంజాయ్‌ చేశానని వెల్లడించాడు. 

Published : 01 Feb 2023 11:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా పేరొందిన స్టార్‌ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ఆటపరంగానే కాకుండా ఫిట్‌నెస్‌లోనూ ఇతర ప్లేయర్లకు ఆదర్శం. కొంతకాలం ఫామ్‌తో ఇబ్బంది పడిన విరాట్.. గత ఆసియా కప్‌ నుంచి మాత్రం చెలరేగిపోతున్నాడు. వరుసగా సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో 46 శతకాలతో కొనసాగుతున్న కోహ్లీ మరో మూడు చేస్తే సచిన్‌ (49)తో సమంగా నిలుస్తాడు. నాలుగు సెంచరీలు పూర్తి చేసుకొంటే మాత్రం వన్డేల్లో అత్యధికంగా శతకాలు బాదిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ఈ ఏడాది పెద్ద ఎత్తున వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. ఫిట్‌నెస్‌ పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్న విరాట్‌కు ఇదేమీ సమస్య కాబోదు. గత ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA) వైద్య సేవలను వినియోగించుకోని ఏకైక క్రికెటర్‌ విరాట్ కోహ్లీ. మరి ఇంత ఫిట్‌గా ఉండే అతడు కూడా గతంలో ఆహార విషయంలో కఠినంగా ఏమీ లేనని, ఆ తర్వాత చాలా మార్పులు చేసుకొన్నట్లు వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. 

‘‘ఎవరైనా సరే 25 సంవత్సరాలు వచ్చే వరకు డైట్‌ విషయంలో పెద్దగా కట్టుదిట్టంగా ఉండరు. నేను కూడా ప్రపంచంలోని అన్ని జంక్‌ ఫుడ్‌లను తిన్నా. అప్పట్లో నాకు విచిత్రంగా ఉండేది. అలాంటి వయసులో అది సాధారణమే’’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. ఆసీస్‌ మీద మంచి రికార్డు ఉన్న విరాట్.. తన టెస్టు సెంచరీల దాహాన్ని తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. ఈ సిరీస్‌లో భారత్‌ విజయం సాధిస్తే.. టెస్టుల్లోనూ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరడంతోపాటు  ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని