Virat Kohli : కోహ్లీ జింబాబ్వేపై అలవోకగా సెంచరీ కొట్టేస్తాడు.. కానీ ప్రయోజనం శూన్యం!

 విరాట్ కోహ్లీ ఫామ్‌తో ఇబ్బంది పడుతుంటడం.. విండీస్‌తో వన్డే సహా టీ20 సిరీస్‌లకు దూరంగా పెట్టడం.. ఆగస్టులో ఆసియా కప్‌, అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జట్టులో...

Published : 29 Jul 2022 02:29 IST

కివీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ స్కాట్ స్టైరిస్‌ వ్యాఖ్యలు

ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ ఫామ్‌తో ఇబ్బంది పడుతుంటడం.. విండీస్‌తో వన్డే సహా టీ20 సిరీస్‌లకు దూరంగా పెట్టడం.. ఆగస్టులో ఆసియా కప్‌, అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో అసలు జట్టులో కోహ్లీ ఉంటాడా.. ఉండడా అన్న చర్చ హాట్‌ టాపిక్‌గా మారింది. టీ20 ప్రపంచకప్‌ వరకు విశ్రాంతి తీసుకోవాలని కొందరు సూచిస్తుండగా.. మరికొందరైతే ప్రతి మ్యాచ్‌ను ఆడాలని కోరుకొంటున్నారు. ఆగస్ట్‌ 27 నుంచి ఆసియా కప్‌ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం విండీస్‌ పర్యటనను భారత్ ఆగస్ట్‌ 7వ తేదీ వరకు కొనసాగించనుంది. విండీస్‌ పర్యటన ముగిశాక పది రోజులపాటు విశ్రాంతి. ఆ తర్వాత మూడు వన్డేలను ఆడేందుకు టీమ్‌ఇండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో జింబాబ్వేతో కోహ్లీని ఆడించాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే కివీస్‌ మాజీ ఆటగాడు స్కాట్‌ స్టైరిస్‌ మాత్రం దానివల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని కొట్టిపడేశాడు. 

‘‘విరాట్ కోహ్లీకి కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్‌ రోహిత్ శర్మ అండగా ఉండటం మంచిదే. అదేవిధంగా విశ్రాంతి తీసుకోవాలని చాలామంది సూచిస్తున్నారు. అయితే జింబాబ్వేతో వన్డేలు ఆడేందుకు విరాట్ కోహ్లీని పంపించాలని కొందరు చెబుతున్నారు. జింబాబ్వేపై  కోహ్లీ అలవోకగా సెంచరీ కొట్టగలడు. కానీ అతడికి పెద్దగా ప్రయోజనం ఉండదు. జింబాబ్వేను తక్కువ చేయడం కాదు.. కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలంటే జింబాబ్వేతో ఆడాల్సిన అవసరం లేదు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని నేను చెబుతా’’ అని స్టైరిస్‌ సూచించాడు. 

వారిద్దరికి తెలుసు.. 

టీ20 ప్రపంచకప్‌ ప్రారంభమయ్యేలోపు పూర్తి సన్నద్ధంగా ఉండేలా జట్టు యాజమాన్యం చర్యలు తీసుకుంటుందని టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు సబా కరీం తెలిపాడు. అదేక్రమంలో విరాట్ కోహ్లీ విలువేంటో రోహిత్, రాహుల్ ద్రవిడ్‌కు తెలుసునని చెప్పాడు. ‘‘ప్రపంచకప్‌ జట్టులోకి విరాట్‌ను తీసుకునే ఆలోచన యాజమాన్యంతోపాటు సెలెక్టర్లకు ఉందో లేదో స్పష్టతనివ్వాలి. జట్టు విజయానికి కోహ్లీ అవసరమని భావించిన తర్వాత.. విరాట్ ఫామ్‌లోకి రావడానికి నా దగ్గర ఓ మార్గం ఉంది. ‘జింబాబ్వేతో మ్యాచ్‌లు ఆడాలని నేను ఆదేశించను. అక్కడ ఆడితేనే ప్రపంచకప్‌కు పరిగణనలోకి తీసుకుంటానని చెప్పను. ఆడాలని భావిస్తే వెళ్లు ఆడు. లేకపోతే విరామం తీసుకుంటానని చెబితే అలానే చేయ్‌. ఆసియా కప్‌ వరకు విశ్రాంతి తీసుకో’ అని కోహ్లీకి చెబుతా’’ అని మాజీ సెలెక్టర్‌ సబా కరీం వ్యాఖ్యానించాడు.  ఒకవేళ జింబాబ్వేతో ఆడినప్పుడూ విఫలమైతే కోహ్లీని జట్టు నుంచి తప్పించడం పెద్ద తప్పిదమవుతుందని కరీం అభిప్రాయపడ్డాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని