Virat Kohli: సంక్రాంతి రారాజు విరాట్‌ కోహ్లీ.. వరుసగా నాలుగోసారి బంపర్‌ హిట్‌!

విరాట్‌ కోహ్లీ (Virat Kohli)కి జనవరి 15 అంటే బాగా ఇష్టం అనుకుంటా. అందుకేనేమో 74 సెంచరీల్లో నాలుగు సెంచరీలు ఆ రోజే (Jan 15) బాదాడు. 

Published : 16 Jan 2023 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సంక్రాంతి (Sankranti) అంటే ఆ సందడే వేరు. ముగ్గులు - గొబ్బెమ్మలు, కొత్త అల్లుళ్లు, సరదాలు - సంబరాలు.. ఇలా చాలానే ఉంటాయి. మీరు క్రికెట్‌ అభిమాని అయితే వీటితోపాటు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) సెంచరీ కూడా ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్‌లో విరాట్‌ విశ్వరూపం మామూలుగా ఉండదు. ఈ పండగ సీజన్‌లో విరాట్‌ ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు సెంచరీలు కొట్టాడు. మూడో వన్డే మ్యాచ్‌లో శ్రీలంకపై విరాట్‌ బాదిన శతకం ఈ వరుసలోకే వస్తుంది. 

ఎప్పుడెప్పుడు ‘శతక’బాదాడంటే...

  • విరాట్‌ సంక్రాంతి సెంచరీ ట్రెండ్‌ 2017 నుంచి నడుస్తోంది. ఆ ఏడాది జనవరి 15న ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో విరాట్‌ 122 పరుగులు చేశాడు. 351 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ విరాట్‌, కేదార్‌ జాదవ్‌ (120) శతకాలతో ఘనవిజయం సాధించింది. 
  • దక్షిణాఫ్రికాతో 2018లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భాగంగా విరాట్‌ జనవరి 15నే సెంచరీ చేశాడు. 153 పరుగులతో ఆ మ్యాచ్‌లో అదరగొట్టాడు. సెంచూరియన్‌లో జరిగిన ఈ టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ తడబడటంతో ఓడిపోయింది. అయినా విరాట్‌ శతకం మెమరబుల్‌గా నిలిచిపోయింది. 
  • ఇక మూడవ సెంచరీ విషయానికొస్తే ఆస్ట్రేలియాపై సాధించాడు. జనవరి 15, 2019న ఆసీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 104 పరుగులు చేశాడు.  299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ను విరాట్‌ సెంచరీ చేసి గెలిపించాడు.
  • నాలుగో సెంచరీ చూస్తే.. శ్రీలంకతో మూడో వన్డేలో (జనవరి 15, 2023) సెంచరీ బాదాడు. 166 పరుగుల అజేయ శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. మరోవైపు బౌలర్లు విజృంభించడంతో ఈ మ్యాచ్‌ను భారత్‌ భారీ ఆధిక్యంతో గెలుపొందింది.

గమనిక:  2020, 2022లో  సంక్రాంతి సీజన్‌లో భారత్‌ మ్యాచ్‌లు ఆడలేదు. 2021లో ఆడినా ఆ జట్టులో విరాట్‌ లేడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని